కలం, వెబ్‌డెస్క్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games) –2026లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించే ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మొయినాబాద్‌లోని గుట్ట జ్వాల ఎక్సలెన్స్ సెంటర్లో ఎంపిక ట్రయల్స్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.
ఖేలో ఇండియా తెలంగాణ యూత్ టీమ్‌కు ప్రతిభావంతులైన ఫెన్సింగ్ క్రీడాకారులను గుర్తించి ఎంపిక చేయడమే ఈ ట్రయల్స్ ప్రధాన ఉద్దేశమని అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫెన్సర్లు ఈ ఎంపిక పోటీలకు హాజరయ్యే అవకాశం ఉంది. తమ ప్రతిభను ప్రదర్శించి తెలంగాణ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ క్రీడాకారులకు ఇది కీలక వేదికగా మారనుంది.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
ఎంపిక ట్రయల్స్‌ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ వెల్లడించింది. క్రీడాకారులతో పాటు కోచ్‌లు, తల్లిదండ్రులు, అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న యూనిట్లు సహకరించాలని కోరింది. ఎంపికైన క్రీడాకారులకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించనుంది. రాష్ట్రంలో ఫెన్సింగ్ క్రీడకు మరింత ప్రోత్సాహం కల్పించడంతో పాటు భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో రాణించగల ప్రతిభను వెలికితీయడానికి ఈ ఎంపికలు దోహదపడనున్నాయి.
తెలంగాణలో ఖేలో ఇండియా సందడి
2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాలు తమ తమ విభాగాల్లో ప్రతిభావంతుల ఎంపిక, శిక్షణపై దృష్టి సారిస్తున్నాయి. క్రీడాకారుల ఎంపిక అనంతరం దశలవారీగా శిక్షణా శిబిరాలు నిర్వహించి అత్యుత్తమ జట్టును సిద్ధం చేసే దిశగా క్రీడా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 తెలంగాణలో డిసెంబర్లో నిర్వహించేందుకు కేంద్రం సహకారం ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పోటీలు జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపిక ట్రయల్స్‌కు విస్తృత ప్రచారం కల్పించి యువ ఫెన్సింగ్ ప్రతిభను ప్రోత్సహించాలని తెలంగాణ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు గుత్తా జ్వాల, జనరల్ సెక్రటరీ వై.శ్రీనివాస్ రావు కోరారు.

