కలం, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ (Ravinder Singh) మున్సిపల్ కార్మికుడి వేషధారణలో హాజరై పారిశుధ్య కార్మికుల సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ప్రతినెలా నిర్వహించాల్సిన కౌన్సిల్ సమావేశాలు, ప్రజా సమస్యలపై చర్చలు సక్రమంగా జరగకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. కార్పొరేషన్ పరిపాలన, ముఖ్యంగా పారిశుధ్య విభాగంలో సిబ్బంది సంఖ్య, వారి విధులు, డివిజన్ల వారీగా కేటాయింపులు, వారికి అందుతున్న సౌకర్యాలపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
“నగరంలో ఎంత విస్తీర్ణం ఉంది? ఎంతమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు? వాస్తవంగా ఎంతమంది విధులకు హాజరవుతున్నారు? ఏ డివిజన్‌కు ఎంతమంది సిబ్బంది కేటాయించారు?” అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. కార్మికులకు అందాల్సిన చీపుర్లు, చెప్పులు, సబ్బులు తదితర రక్షణ, పని సామగ్రి విషయంలో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సామగ్రి పూర్తిస్థాయిలో అందుతున్నదా లేదా అన్నదానిపై విచారణ జరపాలని కోరారు.
“ఒక కార్మికుడికి ఇవ్వాల్సిన ఐదు చీపుర్లలో రెండు మాత్రమే ఇస్తే మిగిలినవి ఎక్కడికి వెళ్తున్నాయి? కార్మికులకు అందాల్సిన సామగ్రి విషయంలో రికార్డులు ఏమి చెబుతున్నాయి?” అని అధికారులను ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, సూపర్‌వైజర్లు, సంబంధిత విభాగాలపై బాధ్యతను నిర్ణయించాలని ఆయన కోరారు. కార్మికుల నుంచి ఎలాంటి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తే వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

