కలం, నిర్మల్: బాసర ఆలయానికి (Basara Temple) వచ్చే భక్తులకు ఇక నుంచి మినీ బస్సు అందుబాటులోకి రానుంది. ప్రఖ్యాత శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ మేరకు ఎస్బీఐ బ్యాంక్ మినీ బస్సును సమకూర్చింది. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆలయ ఈవో అంజనీదేవి, సిబ్బందికి మినీ బస్సును అప్పగించారు. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాసులు శెట్టిని ఈవో అంజనీదేవి అమ్మవారి జ్ఞాపికతో సత్కరించారు.
అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, అర్చకులు మురళీ శ్రోతి, వేద పండితులు నవీన్ శర్మ మినీ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు బస్సును ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఎస్బీఐ ఆర్థిక సహకారంతో బస్సు సమకూరడం ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని అన్నారు.

