ఉద్యోగాల పేరుతో భారీ దందా.. పీఏను విచారించాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు వసూలు చేసిన భద్రాచలం (Bhadrachalam Jobs Scam) ఎమ్మెల్యే పీఏ కళ్యాణ్‌ను సమగ్రంగా విచారిస్తేనే ఈ భారీ కుంభకోణంలో ఉన్న అసలు తిమింగలాలు, సూత్రధారుల జాతకాలు బయటపడతాయని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెట్చేల రంగారెడ్డి అన్నారు. ఈ మోసం వెనుక ఉన్న పెద్దలను తేల్చేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాలతో పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 80 మందికి పైగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారని రంగారెడ్డి ఆరోపించారు. రిక్షా కార్మికులు, పేద, మధ్యతరగతి కుటుంబాలను సైతం వదలకుండా రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేస్తూ, మొత్తంగా రూ. 10 కోట్ల వరకు అక్రమంగా దండుకున్నారని మండిపడ్డారు. ​ఈ అక్రమాలపై పోలీసులకు స్పష్టమైన ఫిర్యాదు అందగా, నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇసుక ర్యాంపుల అనుమతుల కుంభకోణం మరువకముందే.. ఏ అండదండలు చూసుకుని ఈ స్థాయిలో ఉద్యోగ మోసాలకు తెగబడ్డారో లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ​ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు కెట్చేల కల్పన, దాసరి సాయి, మునిగేలా శివ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>