యూఎస్ ఓపెన్‌లో స్టార్ వార్.. ఐదు కారణాలివే!

కలం, స్పోర్ట్స్ : టెన్నిస్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమైంది. సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ 2026 (US Open 2026) కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 30 నుంచి న్యూయార్క్‌లో (New York) ప్రధాన డ్రా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈసారి రికార్డు స్థాయి ప్రైజ్‌మనీతో పాటు పలువురు స్టార్ ఆటగాళ్లు చారిత్రక రికార్డులపై కన్నేశారు. ముఖ్యంగా ఐదు అంశాలు ఈ టోర్నీపై ఆసక్తిని అమాంతం పెంచుతున్నాయి.

1. రికార్డు ప్రైజ్‌మనీ.. తొలి రౌండ్ నుంచే భారీ బహుమతులు

యూఎస్ ఓపెన్ చరిత్రలోనే ఈసారి అత్యధిక ప్రైజ్‌మనీ అందుబాటులోకి వచ్చింది. మొత్తం 108 మిలియన్ డాలర్ల ప్రైజ్‌పూల్‌ను ప్రకటించారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు చెరో 5.5 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. అంతేకాదు.. తొలి రౌండ్‌లో ఓడిపోయిన ఆటగాళ్లకు కూడా 1.40 లక్షల డాలర్లు లభించనున్నాయి. దీంతో టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉండనున్నాయి.

2. 25వ గ్రాండ్‌స్లామ్‌పై జొకోవిచ్ గురి

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో చరిత్ర సృష్టించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించిన జొకోవిచ్.. మరో టైటిల్ గెలిస్తే 25 మేజర్లతో కొత్త రికార్డు నెలకొల్పుతాడు. యూఎస్ ఓపెన్‌ను జొకోవిచ్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచాడు. 2023లో చివరిసారి న్యూయార్క్‌లో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో ఏకంగా 10 సార్లు ఫైనల్‌కు చేరిన అతడి అనుభవం మరోసారి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే 39 ఏళ్ల వయసులో రెండు వారాల పాటు అత్యున్నత స్థాయిలో ఆడటం జొకోవిచ్‌కు అసలు పరీక్ష. ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటాడనేది కీలకం కానుంది.

3. టైటిల్ డిఫెండ్ చేయగలడా అల్కరాజ్?

డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ఈసారి తన టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతున్నాడు. అయితే గాయం కారణంగా సుమారు నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉండటం అతడికి ప్రతికూలంగా మారొచ్చు. ఇప్పుడు తిరిగి కోర్టులోకి వస్తున్న అల్కరాజ్‌కు మరో ఊరటనిచ్చే అంశం ఉంది. జానిక్ సినర్ ఈ టోర్నీలో లేకపోవడంతో పురుషుల టైటిల్ రేసు మరింత ఓపెన్‌గా మారింది. అయితే టైటిల్ కోసం అల్కరాజ్‌కు ఇతర టాప్ ప్లేయర్ల నుంచి గట్టి పోటీ తప్పదు. గాయం తర్వాత అతడి ఫిట్‌నెస్, మ్యాచ్ రిథమ్‌పై అందరి దృష్టి ఉంది.

4. మళ్లీ ఒకే కోర్టులో సెరెనా-వీనస్!

యూఎస్ ఓపెన్ 2026లో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో విలియమ్స్ సిస్టర్స్ రీఎంట్రీ ఒకటి. సెరెనా, వీనస్ విలియమ్స్ సోదరీమణులకు డబుల్స్‌లో వైల్డ్‌కార్డ్ లభించింది. 2022 తర్వాత తొలిసారి వీరిద్దరూ యూఎస్ ఓపెన్‌లో కలిసి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే విలియమ్స్ సిస్టర్స్ జోడీగా 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లు గెలిచింది. అందులో రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. ఈసారి ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నా.. ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ ఒకే కోర్టులో కనిపించనుండటం అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌గా మారనుంది.

5. సబలెంకా హ్యాట్రిక్ కొడుతుందా?

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆర్యానా సబలెంకాపై భారీ అంచనాలు ఉన్నాయి. గత రెండు యూఎస్ ఓపెన్ టైటిళ్లను వరుసగా గెలిచిన సబలెంకా.. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. మూడోసారి కూడా టైటిల్ గెలిస్తే సెరెనా విలియమ్స్ తర్వాత వరుసగా మూడు యూఎస్ ఓపెన్ టైటిళ్లు సాధించిన తొలి మహిళగా సబలెంకా నిలుస్తుంది. సెరెనా 2012 నుంచి 2014 వరకు ఈ ఘనత సాధించింది. వింబుల్డన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. యూఎస్ ఓపెన్‌లో సబలెంకా రికార్డు మాత్రం బలంగా ఉంది. దీంతో న్యూయార్క్‌లో ఆమె ప్రదర్శనపై భారీ ఆసక్తి నెలకొంది. రికార్డు ప్రైజ్‌మనీ నుంచి చారిత్రక రికార్డుల వరకు యూఎస్ ఓపెన్ 2026లో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి. 25వ గ్రాండ్‌స్లామ్ కోసం జొకోవిచ్ పోరాటం.. టైటిల్ డిఫెన్స్ కోసం అల్కరాజ్ ప్రయత్నం.. హ్యాట్రిక్ కోసం సబలెంకా వేట.. విలియమ్స్ సిస్టర్స్ రీఎంట్రీ.. ఇవన్నీ టోర్నీకి అదనపు ఆకర్షణగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>