కలం, మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈనెల 27న తెల్లవారుజామున మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించి వారిని రిమాండ్ తరలించినట్లు నారాయణపేట డిఎస్పి మహేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచార ఘటన (Makthal Rape Case)కు సంబంధించి శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పి మహేష్ పూర్తి వివరాలను వెల్లడించారు.
మక్తల్ పట్టణానికి చెందిన మహిళ తన పదమూడేళ్ల కుమారుడితో కలిసి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద నిద్రిస్తుండగా మక్తల్ పట్టణానికి చెందిన బోయ అరవింద్(19), బోయ విజయ్(19) లు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. అచేతన స్థితిలో పడి ఉన్న మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆమె తెలిపిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశామన్నారు.
నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో మక్తల్ సీఐ రాంలాల్, మక్తల్ ఎస్సై రాజు యాదవ్ లు సిబ్బందితో కలిసి విశేష కృషి చేశారని ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను శుక్రవారం మక్తల్ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా, వారి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి మహేష్ తెలిపారు.

