కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ మంత్రి సీతక్క (Seethakka) రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం నివాసం వద్ద మీడియా మిత్రులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడారు. ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని.. వారి రక్షణ కోసం కట్టే రాఖీ వారి బంధానికి ప్రతీక అని తెలిపారు. 12 సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డికి తాను రాఖీ కడుతూనే ఉన్నానని అన్నారు. ఒక ఆదివాసి బిడ్డను, అడవి బిడ్డను, మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డను ఈ స్థాయికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర కృషి చాలా ఉందని చెప్పారు. వారి సహకారం మరువలేనిదని అన్నారు.
ప్రతి ఏడాది ములుగు నియోజకవర్గ ప్రజలకు రాఖీ కట్టి సంప్రదాయాన్ని ప్రారంభిస్తానని సీతక్క చెప్పుకొచ్చారు. ములుగు ప్రజల ఆశీస్సులు దీవెనలతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తున్నానని అన్నారు. తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. సోదరుడు సీఎం రేవంత్ రెడ్డికి చాలామంది మహిళలు, సహచర మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ మహిళా నాయకులు, బ్రహ్మకుమారీలు వచ్చి రాఖీలు కట్టారని అన్నారు. వందల మంది మహిళలు వచ్చినా ఓపిగ్గా సీఎం రాఖీ కట్టించుకుంటున్నారని చెప్పారు.

