దంపతుల ఆత్మహత్య.. బయటపడిన సంచలన ఆడియో!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి (Chinchinada Bridge) వద్ద మూడేళ్ల బిడ్డను స్కూటీపై వదిలి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ దొడ్డ వెంకట సాయికృష్ణ, శిరీష దంపతుల ఘటనలో ఒక సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బలవన్మరణానికి ముందు సాయికృష్ణ రికార్డు చేసిన చివరి ఆడియో సందేశం బయటకురావడంతో ఈ దారుణానికి వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యాయి.

సాయికృష్ణ, శిరీషలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో సాయికృష్ణ అప్పులపాలయ్యాడు. ఆ అప్పుల భారం తట్టుకోలేక సుమారు రెండు నెలల క్రితం భీమవరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చి నివాసముంటున్నారు. అయితే, ఓ స్నేహితుడు తాకట్టు పెట్టమని తనకు ఇచ్చిన ఉంగరం వ్యవహారంలో ఎదురైన వేధింపులు, ఒత్తిళ్లే తమను ఈ దారుణ నిర్ణయానికి ప్రేరేపించాయని సాయి ఆ ఆడియోలో పేర్కొన్నారు. బతకాలని ఎంతగా ఆశపడినా పరిస్థితులు అనుకూలించక బతకలేకపోతున్నామని వెల్లడించారు. తమ నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

గోదావరిలో దూకి గల్లంతైన ఈ దంపతుల మృతదేహాల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు లేక ఒంటరిగా మారిన మూడేళ్ల బాలుడిని చూసి స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆడియో ఆధారంగా సమగ్ర విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>