కలం, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్ (Kukatpally JNTUH)లో ర్యాగింగ్ కలకలం రేపింది. మంజీర హాస్టల్‌లో ఉంటున్న థర్డ్ ఇయర్ విద్యార్థులు తెల్లవారుజామున 2 గంటల సమయంలో గౌతమి హాస్టల్‌లో ఉంటున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల గదుల వద్దకు వెళ్లారు. తలుపులను బాదుతూ లోపల ఉన్న విద్యార్థులను భయాందోళనకు గురి చేశారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు భయంతో తలుపులు తీయలేదు. శుక్రవారం కాలేజీ ప్రారంభం కాగానే ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై స్పందించిన జేఎన్‌టీయూహెచ్ ప్రిన్సిపాల్ పూర్తి వివరాలు సేకరించేందుకు ఒక కమిటీని నియమించారు. తెల్లవారుజామున సీనియర్లు హాస్టల్‌కు రావడానికి గల కారణం ఏమిటి? అసలు అక్కడ ర్యాగింగ్ జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రిన్సిపాల్ ఏర్పాటు చేసిన కమిటీ అందించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

