కలం, స్పోర్ట్స్: యూఏఈ స్టార్ బ్యాటర్ ఆసిఫ్ ఖాన్‌కు (UAE Batter Asif Khan) భారీ షాక్ తగిలింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 15 నెలల నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించింది. 36 ఏళ్ల ఆసిఫ్ ఖాన్ 2025 సెప్టెంబర్ 8న పోటీకి బయట నిర్వహించిన డోపింగ్ పరీక్షకు హాజరయ్యాడు. అతడి నమూనాలో మెస్టెరోలోన్ మెటాబోలైట్ గుర్తించారు. ఇది నిషేధిత పదార్థం కావడంతో ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్‌లోని ఆర్టికల్ 2.1ను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. తనపై వచ్చిన డోపింగ్ ఉల్లంఘనను ఆసిఫ్ అంగీకరించాడు. ఐసీసీ, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA)తో కుదిరిన కేస్ రిజల్యూషన్ ఒప్పందంలో భాగంగా 15 నెలల నిషేధాన్ని అంగీకరించాడు. ఈ ఒప్పందం ప్రకారం అతడికి అప్పీల్ చేసే అవకాశం కూడా ఉండదని ఐసీసీ తెలిపింది.
2025 సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 29న తాత్కాలిక సస్పెన్షన్ విధించే వరకు ఆసిఫ్ ఆడిన మ్యాచ్‌ల ఫలితాలను కూడా రద్దు చేశారు. ఆయా మ్యాచ్‌ల ద్వారా సాధించిన పాయింట్లు, మెడల్స్, ప్రైజ్‌మనీ, ఇతర బహుమతులను కోల్పోవాల్సి ఉంటుంది.అయితే నిషేధ సమయంలో శిక్షణకు మాత్రం హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 8 నుంచి యూఏఈ అధికారిక క్రికెట్ సౌకర్యాల్లో ఆసిఫ్ శిక్షణ తీసుకోవచ్చు. అయితే పోటీ మ్యాచ్‌లకు మాత్రం నిషేధ కాలం పూర్తయ్యే వరకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆసిఫ్ ఖాన్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. యూఏఈ తరఫున ఇప్పటివరకు 38 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. వన్డేల్లో 1,270 పరుగులు, టీ20ల్లో 1,302 పరుగులు సాధించాడు. 2025లోనే అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. తాజాగా డోపింగ్ నిషేధంతో అతడి అంతర్జాతీయ కెరీర్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

