కలం, స్పోర్ట్స్: ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (Odisha Cricket Association ) వివాదంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఎన్నికలు నిర్వహించకపోతే నిధులు నిలిపివేయడంతో పాటు ఓసీఏ గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉందని బీసీసీఐ హెచ్చరించింది. ఈ కేసుపై ఒడిశా హైకోర్టులో గురువారం (ఆగస్టు 27) తదుపరి విచారణ జరగనుంది. ఓసీఏలో 2025 అక్టోబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 2025 ఆగస్టు 31, 2026 ఫిబ్రవరి 22న జరిగిన సమావేశాల్లో మెజారిటీ నిర్ణయంతో ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో 2019 అక్టోబర్ నుంచి పంకజ్ మొహంతి అధ్యక్షుడిగా, సంజయ్ బెహరా కార్యదర్శిగా, వికాస్ ప్రధాన్ కోశాధికారిగా కొనసాగుతున్నారు.
ఎన్నికలను వెంటనే నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఒడిశా మాజీ క్రికెటర్ లలితేందు బిధ్యధర్ మొహపాత్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై బీసీసీఐ లీగల్ సీనియర్ మేనేజర్ మెలిండా కొలాకో ద్వారా అఫిడవిట్ దాఖలు చేసింది. లోధా కమిటీ సిఫార్సులు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఓసీఏ తప్పనిసరిగా పాటించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. నిబంధనలను పాటించకపోతే గ్రాంట్లు నిలిపివేస్తామని, రెండేళ్లకు మించి ఎన్నికలు జరగకపోతే గుర్తింపును రద్దు చేసే అధికారం బీసీసీఐకి ఉందని పేర్కొంది. మరోవైపు, జాతీయ క్రీడా పాలన చట్టం-2025పై స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తున్నామని ఓసీఏ కోర్టుకు తెలిపింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కావడంతో కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొంది. అయితే ఈ వాదనను బీసీసీఐ తోసిపుచ్చింది. క్రికెట్ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని స్పష్టం చేసింది.

