కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో మరణించిన నేపాల్ దేశానికి చెందిన వ్యక్తి కుటుంబానికి అన్నం ఫౌండేషన్ (Annam Foundation) ఆపద్బాంధవుడిగా నిలిచింది. సరిహద్దులు దాటిన మానవత్వంతో వలస కూలీ మృతదేహానికి స్థానిక వైకుంఠ ధామంలో సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించింది. వివరాల్లోకి వెళ్తే.. నేపాల్ దేశంలోని కైలాలీ జిల్లాకు చెందిన భారత్ ధమాయి (45) ఉపాధి కోసం నేపాల్ నుంచి చెన్నైకి రైలులో బయలుదేరారు. మార్గమధ్యలో అస్వస్థతకు గురైన ఆయన ఖమ్మం జిల్లాలోని మోటమర్రి – బోనకల్ రైల్వే స్టేషన్ల మధ్య మృతి చెందారు. సమాచారం అందుకున్న ఖమ్మం రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
అక్కడికి తీసుకెళ్లలేమని..
మృతుడి వద్ద లభించిన ఆధారాల ద్వారా నేపాల్ దేశంలోని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఖమ్మం చేరుకుని భారత్ ధమాయిని గుర్తుపట్టారు. మృతదేహాన్ని నేపాల్‌కు తరలించేంత ఆర్థిక స్తోమత తమకు లేదని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగానే దహన సంస్కారాలు చేసేందుకు సహకరించాలని పోలీసులను కోరారు. దీంతో రైల్వే పోలీసులు అన్నం ఫౌండేషన్‌ను సంప్రదించారు.
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి, మార్చురీ సిబ్బంది సమక్షంలో అన్నం ఫౌండేషన్ మృతదేహాన్ని స్వీకరించింది. నేపాల్ ఆచారాల ప్రకారం తెల్లటి వస్త్రంతో చుట్టి, పూలమాలలతో నివాళులర్పించి బల్లేపల్లి వైకుంఠ ధామానికి తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

