కలం, నాగర్ కర్నూల్ : నాగర్కర్నూల్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలోని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ జాతీయ బ్యాంకులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు చెందిన జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, సంబంధిత అధికారులతో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి (Mallu Ravi), జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో బ్యాంకుల పనితీరు, వివిధ రకాల రుణాల పంపిణీ, నిర్దేశించిన లక్ష్యాల సాధనపై సమీక్షించారు. క్రాప్ లోన్స్, వ్యవసాయ ఆధారిత రుణాలు, ముద్ర లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.
రైతులకు అవసరమైన సమయంలో వ్యవసాయ రుణాలు అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని సూచించారు. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, చిన్నతరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాలను ప్రోత్సహించే విధంగా అర్హులైన వారికి రుణాలు అందించాలని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు ఉపయోగపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, బ్యాంకింగ్ సేవలు రుణ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజలకు పథకాలపై సమాచారం సులభంగా అందేలా ప్రతి బ్యాంకు శాఖలో సామాజిక భద్రతా పథకాల వివరాలు, అర్హతలు, ప్రయోజనాలను ప్రదర్శించాలని తెలిపారు. బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేసి, రుణ లక్ష్యాల సాధనతో పాటు ప్రభుత్వ సంక్షేమ, సామాజిక భద్రతా పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.
సమీక్ష సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ జాతీయ బ్యాంకులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు చెందిన జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

