కలం, నిర్మల్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బోధన తీరును స్వయంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సమయంలో కేవలం అధికారులతో వివరాలు తెలుసుకుని వెళ్లిపోకుండా విద్యార్థులతో నేరుగా మమేకమవుతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులతో కొంత సమయం తరగతి గదిలో గడుపుతూ పాఠాలు బోధిస్తున్నారు. పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహన స్థాయిని తెలుసుకుంటున్నారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందిస్తూ పెన్నులను బహుమతులుగా అందజేస్తున్నారు.
గురువారం భైంసా కేజీబీవీని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్య, హాజరు వివరాలతో పాటు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రతిరోజూ అందిస్తున్న భోజనం, విద్యా బోధన తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌లోని గణితం, భౌతిక శాస్త్రం తదితర సబ్జెక్టుల నుంచి పలు అంశాలను బోధించి, విద్యార్థులకు ప్రశ్నలు వేశారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలను పరిశీలించి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించి పెన్నులను బహుమతులుగా అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎంపీడీవో నీరజ్ కుమార్, ఎంఈవో సుభాష్, ఎంపీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

