కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పాలకులు అనుసరిస్తున్న కార్మిక పాలసీ లోపభూయిష్టంగా కొనసాగుతోందని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆరోపించారు. సెప్టెంబర్ 6,7, 8 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగనున్న ఆల్ ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగవ మహాసభల విజయవంతానికి గురువారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికుల సన్నాహక సమావేశం జరిగింది. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గం 80 ఏళ్ల స్వతంత్ర దేశంలో కూడా దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని వాపోయారు. కార్మిక వర్గం చేసిన అనేక పోరాటాల ఫలితంగా కార్మిక చట్టాలు రూపొందించిన కార్మికుల బతుకుల్లో సమూల మార్పులకు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నయా ఉదారవాద ఆర్థిక విధానాలు కార్మికుల సంక్షేమానికి మరణ శాసనాలుగా మారుతున్నాయని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని దీని ద్వారా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని బూటకపు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
8 గంటల పని దినం హక్కులను ఉల్లంఘిస్తూ మల్లి కార్మిక వర్గాన్ని బానిసలుగా తయారుచేసే ప్రయోగశాలగా భారతదేశంలో 12 గంటల పని విధానానికి ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం 26 వేలకు పెంచాలని, జాతీయ పండగ ఆర్థిక సెలవులు కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వాటి విజయవంతానికి కార్మికులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కార్మికులు రంగన్న, అంజి, యాదయ్య,శేఖర్, జగ్గా నాయక్, వసంత, పద్మ, అంజమ్మ, వెంకటమ్మ, సరోజ,నాగలక్ష్మి, తిరుపతమ్మ, లక్ష్మమ్మ, నిరీక్షణ, కలమ్మ, నిర్మల, లక్ష్మి, అలివేల, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

