కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని, పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గురువారం ‘జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నివారణ కమిటీ’ సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు దుర్భరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు, కార్మికులు వీటి బారిన పడకుండా ముందస్తు అవగాహన కల్పించాలన్నారు. అందుకోసం విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో గంజాయి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని, మత్తు పదార్థాల విక్రయం, రవాణా వంటి చర్యలను అత్యంత తీవ్రంగా పరిగణించాలని సూచించారు.
ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తంగా..
ఆర్టీసీ బస్సుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు కండక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. అనుమానాస్పద వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు ప్రణాళికబద్ధంగా సమన్వయంతో పనిచేస్తూ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

