బీఆర్‌ఎస్‌లో వెన్నుపోటు కుట్ర.. కవిత సంచలన ఆరోపణలు!

కలం, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు మాజీ మంత్రి హరీష్ రావు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. మెదక్ ఎమ్మెల్యేలతో హరీష్ రావు ఇటీవల రహస్య సమావేశం నిర్వహించారని, కేసీఆర్ తర్వాత పార్టీ నాయకత్వంపై చర్చించారని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ పెద్దమనిషిలా ఉండాలని, ఆయన కుమారుడికి వారసత్వం ఇవ్వడం సరికాదని హరీష్ రావు చెప్పినట్లు ఓ ఎమ్మెల్యే తనకు తెలిపారని కవిత వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటును గుర్తు చేస్తున్నాయని అన్నారు.

బీఆర్‌ఎస్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, ఆ తర్వాత బీజేపీ మద్దతు పొందేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. బీజేపీతో ఆయనకు మిలాఖత్ ఉందని, ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్‌కు ఓ ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు వచ్చినప్పుడల్లా ఆయనకు పసుపు, మిరియాలు కలిపిన పాలు పంపుతున్నారని, ఆ సమయంలో హరీష్ రావు తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆయనతో సమావేశమవుతున్నారని ఆరోపించారు.

లండన్ వేదికగా లాలూచీ..

ఇటీవల లండన్‌లో హరీష్ రావు, మరో కీలక రాజకీయ నాయకుడి మధ్య సమావేశం జరిగిందని కవిత పేర్కొన్నారు. ఆ సమావేశంలో జరిగిన లాలూచీ, ఒప్పందాల వివరాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని అన్నారు. లండన్‌లో ఎలాంటి ఒప్పందం జరగకపోతే, తన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని, సంబంధిత వ్యక్తులపై క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ఆంధ్రా వారికి ఇవ్వడాన్ని కవిత తప్పుబట్టారు. తెలంగాణలో బ్రాహ్మణ మేధావులు లేరా అని ప్రశ్నించారు. ప్రస్తుత బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణవాదులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పేద బ్రాహ్మణులకు మేలు చేయాల్సిన బ్రాహ్మణ పరిషత్ ఆంధ్రా వ్యక్తులకు అడ్డాగా మారిందని విమర్శించారు. వెంటనే ఆంధ్రా వారికి ఇచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను తొలగించి తెలంగాణ వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

హరీశ్ పై పాల వ్యాపారం ఆరోపణలు..

ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు కార్పొరేట్ సంస్థలతో భారీగా పాల వ్యాపారం చేశారని కవిత ఆరోపించారు. నారాయణ, చైతన్య కాలేజీలకే నెలకు రూ.5 కోట్ల చొప్పున ఎనిమిదేళ్లలో సుమారు రూ.960 కోట్ల విలువైన పాల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. కిమ్స్, కామినేని, యశోద వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా పాలు సరఫరా చేశారని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఆంధ్రా వ్యాపార సంస్థలతో ఇలా పాల వ్యాపారం చేయడం క్విడ్ ప్రో కో కాదా అని ప్రశ్నించారు.

కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్ డెయిరీ, విజయ డెయిరీ వంటి తెలంగాణ డెయిరీలకు విద్యార్థులు ఎక్కువగా ఉన్న విద్యాసంస్థల్లో పాల సరఫరా చేసే అవకాశం కల్పించేలా ప్రభుత్వం జీవో ఇవ్వాలని కవిత సూచించారు.

గతంలో బీఆర్‌ఎస్ వ్యవస్థీకృత అవినీతి..

గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ వ్యవస్థీకృత అవినీతికి పాల్పడిందని కవిత (Kavitha) ఆరోపించారు. పాల వ్యాపారం ఒకరికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మరొకరికి, ఇసుక వ్యాపారం ఇంకొకరికి అన్నట్టుగా విభజించుకుని అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెబుతూ బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తోందని, వ్యవస్థీకృత అవినీతికి పాల్పడిన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటనను అడ్డుకుంటే 48 నిమిషాల పాటు ప్రెస్‌మీట్ పెట్టగలిగారని, కానీ ఎంపీ కుమారుడి కారు ప్రమాదంపై ఒక్క క్షణం కూడా మాట్లాడలేదని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఆంధ్రా అధికారులదే పెత్తనం..

తెలంగాణలోని కీలక ప్రభుత్వ శాఖల్లో ఆంధ్రా అధికారుల పెత్తనం కొనసాగుతోందని కవిత ఆరోపించారు. ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ శాఖల్లో రెడ్‌కో ఛైర్మన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సహా కీలక స్థానాల్లో ఆంధ్రా వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భక్తుల డబ్బులతో నిర్మించిన యాదాద్రి ఆలయ బోర్డులో ఆంధ్రా హీరో భార్యకు సభ్యత్వం కల్పించడాన్ని కూడా తప్పుబట్టారు. తిరుపతి బోర్డులో తెలంగాణ వారికి అవకాశం ఇవ్వడం ద్వారా అక్కడి నిధుల్లో మనవాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తే, యాదాద్రిలో కూడా తెలంగాణ వారికే ప్రాధాన్యం ఉండాలని అన్నారు.

బయోకాన్‌లో తెలుగు మాట్లాడినందుకు సుమారు 200 మందిని తొలగించారన్న ఆరోపణలపైనా ముఖ్యమంత్రి స్పందించడం లేదని కవిత విమర్శించారు. ఇతర కంపెనీల్లోనూ తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని ఆరోపించారు. నారాయణ కాలేజీలో సంవత్సరం మధ్యలో పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించారని, వారి భవిష్యత్తు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కాంప్రమైజ్..

తెలంగాణ ప్రయోజనాలను ముఖ్యమంత్రి తాకట్టు పెడుతున్నప్పటికీ బీఆర్‌ఎస్ మాట్లాడటం లేదని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీఆర్‌ఎస్ పూర్తిగా కాంప్రమైజ్ అయిందని, అందుకే ఒడిశా యువతి మృతి ఘటన, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా నీళ్ల అంశం వంటి విషయాలపై ఆ పార్టీ స్పందించడం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు వ్యాపార సంబంధాలు ఉండటం వల్లే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ, ఆంధ్రా వర్గాలతో లాలూచీ ఉందని కవిత ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలపై ఇప్పటికైనా ఆయనకు తెలంగాణ సోయి రావాలని, లేదంటే ఎక్కడ కనిపించినా “ఆంధ్రా రేవంత్ రెడ్డి” అని పిలుస్తానని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సంబంధించిన కీలక పదవుల్లో ఆంధ్రా వారికి ఇచ్చిన అవకాశాలను తొలగించి తెలంగాణ వారికి కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>