కలం, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ – 2026 (Forbes India Showstoppers) మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రచురించిన ఈ మ్యాగజైన్ జాబితాలో ఇంకా దేశంలో ఎంతో మంది స్టార్ల ఫోటోలు కూడా ప్రచురించారు. వీరిలో విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్, స్మృతి మంధాన కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా సినీ, క్రీడా, సంగీత రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో తెలుగు హీరోకు చోటు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది.
పుష్ప మూవీ సాధించిన ఘన విజయం అల్లు అర్జున్‌కు దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. బన్నీని ఈ సినిమా పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది. ఈ సినిమాతో బన్నీ ఫాలోయింగ్ పెరగడంతో పాటు ఇతర భాషల డైరెక్టర్ల నుంచి బన్నీకి స్టోరీలు రావడం కూడా మొదలైంది. ఇప్పటికే బన్నీ ఓ తమిళ డైరెక్టర్‌తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇక ఫోర్బ్స్ జాబితాలో బన్నీకి చోటు దక్కడంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

