కలం, వరంగల్ బ్యూరో : జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ పెరోల్‌పై బయటకు వచ్చి.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు జైలు శిక్షను తప్పించుకున్న ఘటన సంచలనం రేపుతోంది. ఈ సమయంలో అతడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించడమే కాకుండా.. ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డును కూడా అందుకున్నాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా స్వేచ్ఛగా జీవించాడు. చివరకు 40 ఏళ్ల 58 రోజుల అనంతరం పోలీసులకు చిక్కి తిరిగి జైలు పాలయ్యాడు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983 జూన్ 9న వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు (Warangal Life Convict) విధించింది. దీంతో అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అదే ఏడాది డిసెంబరు 17న పెరోల్‌పై బయటకు వచ్చిన వీరన్న.. 1984 మార్చి 18న తిరిగి జైలులో లొంగిపోవాల్సి ఉంది. అయితే నిర్ణీత గడువులోగా జైలుకు తిరిగి రాలేదు. ఆ తర్వాత వీరన్న మహబూబాబాద్ జిల్లాలోనే ఉంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. 2004లో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డును సైతం అందుకున్నాడు.
2013లో ఉద్యోగ విరమణ చేశాడు. అయినప్పటికీ అతడు జైలు శిక్షను అనుభవించాల్సి ఉందన్న విషయం అధికారుల పర్యవేక్షణలోకి రాలేదు. చివరకు 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరన్నను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడికి మూడేళ్లపాటు ఎలాంటి పెరోల్, జైలు శిక్ష మినహాయింపు ఇవ్వొద్దంటూ మెమో జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరన్న భార్య సందెల చారమ్మ హైకోర్టును ఆశ్రయించారు.
వీరన్న 40 ఏళ్లుగా మహబూబాబాద్ జిల్లాలోనే అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు చర్యలు తీసుకోవడం సమంజసం కాదని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అయితే ధర్మాసనం ఆ వాదనను అంగీకరించలేదు. వీరన్న ఉద్దేశపూర్వకంగానే జైలుకు తిరిగి వెళ్లకుండా తప్పించుకున్నట్లు పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీలపై జైళ్ల శాఖ మరింత పటిష్ఠమైన నిఘా ఉంచాలని సూచించింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు.. టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జీవిత ఖైదీగా జైలుకు వెళ్లిన వ్యక్తి.. పెరోల్‌పై బయటకొచ్చి ప్రభుత్వ ఉద్యోగిగా మారి, అవార్డు పొంది, రిటైర్ అయిన తర్వాత నాలుగు దశాబ్దాలకు పట్టుబడటం.. జైళ్ల శాఖ పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేసింది.

