కూతురి వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. కొండా ఫ్యామిలీ అలర్ట్‌?

కలం, వరంగల్‌ బ్యూరో: కూతురు వివాదాస్పద వ్యాఖ్యలు. తల్లి మౌనం. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ. తండ్రి రంగంలోకి. కీలక నేతలతో వరుస భేటీలు.. ఇంతకూ కొండా కుటుంబం వ్యూహమెంటీ..? అనేదే హాట్ టాపిక్ గా మారింది. ఈనెల 19న మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో భాగంగా గీసుకొండలో కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రంగా మారాయి.

సీఎం, సొంత పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పార్టీలోని పలువురు నేతలు తప్పుబట్టారు. వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సుస్మితపై చర్యలు తీసుకోవాలని, మంత్రి కొండా సురేఖ (Konda Surekha)ను తప్పించాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో అధిష్ఠానం సురేఖ వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.

కూతురు వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికి సురేఖ మాత్రం బహిరంగంగా స్పందించలేదు. పార్టీ నోటీసుకు ఇచ్చిన వివరణలో.. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలేనని సురేఖ స్పష్టం చేశారు. వరంగల్‌కు వచ్చిన సమయంలోనూ మీడియా ప్రశ్నించినా.. ‘నో కామెంట్‌’ అంటూ స్పందించకుండా వెళ్లిపోయారు.

సురేఖపై వేటు ప్రచారంతో ఎంట్రీ

ఇక మంత్రి సురేఖపై పార్టీ అధిష్టానం వేటు వేయనుందనే ప్రచారం జోరుగా కొనసాగుతుండగా, కొండా మురళి రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ కావడం పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. భేటీల అనంతరం కూతురి వ్యాఖ్యలపై మురళి స్పందించారు. ‘నా కూతురు వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు. అవి ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలు’ అని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాము పార్టీని వీడేది లేదని, సోనియా, రాహుల్ పై తమకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించడం చర్చకు పెట్టింది.

ముగ్గురూ ఒకటేనా?

మంత్రి సురేఖ అధిష్ఠానానికి ఇచ్చిన వివరణలోనూ ఇదే వైఖరి కనిపించింది. తాజాగా మురళి చెప్పిన మాటల్లోనూ అదే స్వరం కనిపిస్తోంది. కూతురు వ్యాఖ్యలను తమ రాజకీయ బాధ్యతగా స్వీకరించకుండా, అవి పూర్తిగా వ్యక్తిగతమని తల్లిదండ్రులు చెప్పడం ద్వారా వివాదాన్ని కుటుంబ పరిధిలోనే పరిమితం చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నారా? అనే చర్చ నడుస్తోంది. ఓ వైపు సురేఖ మౌనం పాటిస్తుండగా.. మరోవైపు మురళి కీలక నేతలను కలుస్తుండటం కూడా నష్టనివారణ చర్యల్లో భాగమేనా అనే ప్రశ్నలు తలెత్తాయి.

అధిష్టానంతో ‘రాజీ’ కోసమేనా?

మురళి వరుస భేటీల వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేదే ఇప్పుడు కీలకంగా మారింది. కూతురు వ్యాఖ్యలతో ఏర్పడిన ప్రతికూలతను అధిష్ఠానం దృష్టిలో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారా? పార్టీ పెద్దలతో సంబంధాలను చక్కదిద్దుకునే ప్రయత్నమా? లేక భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై ముందస్తు చర్చలా? అనే సస్పెన్స్ నెలకొంది. మరోవైపు మురళి భేటీలకు, మంత్రి సురేఖపై జరిగే ప్రచారానికి ప్రత్యక్ష సంబంధం ఉందా అనే వాదనలు లేకపోలేదు.

అయితే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడంపైగానీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడంపైనా అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయలేదు. ఇంతకూ సురేఖ పై ‘వేటు ఉంటుందా?’ అనేదానికంటే కొండా కుటుంబం అధిష్ఠానంతో ఎలా చక్కదిద్దుకుంటుంది? అనేదానిపైనే విస్తృతంగా చర్చ నడుస్తోంది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం చివరకు సురేఖ మంత్రి పదవికి ఎసరు పెడుతుందా? లేక కొండా దంపతుల నష్టనివారణ వ్యూహం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు రాజకీయాల్లో హాట్ హాట్ చర్చగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>