కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదం రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి, దాదాపు 40 నిమిషాలపాటు కొండా సురేఖ వ్యవహారంపై చర్చించారు. పార్టీ నిబంధనలను ధిక్కరించిన ఆమెపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, శాసనసభ్యులందరూ ఈ విషయంలో ఏకతాటిపై నిలిచారని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఆమెపై వేటు పడనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో, రాష్ట్రంలోని ఈ ముగ్గురు కీలక నేతల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది.

