గంభీర్‌పై జాఫర్ ఫైర్.. టెస్టు ఓటములే పెద్ద మచ్చ!

కలం, స్పోర్ట్స్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Gautam Gambhir) మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు సాధించినప్పటికీ.. స్వదేశంలో ఎదురైన టెస్టు వైట్‌వాష్‌లు మాత్రం ఆయన కోచింగ్ కెరీర్‌పై పెద్ద మచ్చగా మిగిలిపోతాయని జాఫర్ అభిప్రాయపడ్డారు. గంభీర్ నేతృత్వంలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌ టైటిళ్లను కైవసం చేసుకుంది. దీంతో వైట్‌బాల్ క్రికెట్‌లో గంభీర్‌ను తప్పుపట్టేందుకు పెద్దగా కారణం లేదని జాఫర్ పేర్కొన్నారు. అయితే టెస్టు క్రికెట్‌లో మాత్రం జట్టు ప్రదర్శనపై సమీక్ష అవసరమని అన్నారు.

టెస్టుల్లోనే అసలు సమస్య

గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. 2024 అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 0-3తో ఓటమిపాలైంది. దీంతో స్వదేశంలో 12 ఏళ్లుగా కొనసాగిన టెస్టు సిరీస్ ఓటమిలేని రికార్డుకు తెరపడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ భారత్ 0-2తో పరాజయం చవిచూసింది. ఈ రెండు సిరీస్‌ల ఫలితాలు 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అవకాశాలను కూడా దెబ్బతీశాయి.

ఆ రెండు వైట్‌వాష్‌లు మచ్చలే..

స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన రెండు వైట్‌వాష్‌లు గంభీర్ కోచింగ్ కెరీర్‌లో ఎప్పటికీ మిగిలిపోతాయని వసీం జాఫర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ సిరీస్‌ల్లో భారత్ విజయం సాధించి ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని పేర్కొన్నారు.

సూర్య, షమీ విషయంలో అసంతృప్తి

కొన్ని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై కూడా జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను జట్టుకు దూరం చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మహమ్మద్ షమీ విషయంలోనూ మరింత మెరుగైన విధానం అవలంబించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైట్‌బాల్ క్రికెట్‌లో గంభీర్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఆటగాళ్లతో పాటు కోచింగ్ వ్యవస్థ కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉందని జాఫర్ సూచించారు. రెండు ఐసీసీ టైటిళ్లు గంభీర్ ఖాతాలో ఉన్నా.. టెస్టుల్లో వచ్చిన ఫలితాలు మాత్రం ఆయన కోచింగ్‌పై చర్చకు దారితీస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>