కలం, స్పోర్ట్స్ : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ ఈసారి మరింత గ్రాండ్‌గా యూఏఈ వేదికగా జరగనుంది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 18 వరకు ఈ సిరీస్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. తొలి రెండు సీజన్లు యునైటెడ్ కింగ్‌డమ్‌లో విజయవంతంగా ముగిశాయి. ఆ సమయానికి సీజన్ 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 425 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీనితో లీగ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు మూడో సీజన్‌ను తొలిసారిగా యూఏఈకి తరలిస్తున్నారు. ఈసారి పోటీల్లో ఏడు జట్లు తలపడనున్నాయి. పాత ఆరు జట్లతో పాటు ఈ సీజన్‌లో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ కొత్తగా చేరింది.
దీనితో ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు మైదానంలోకి దిగనున్నారు. యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, షాహిద్ అఫ్రిది, మొయిన్ అలీలతో పాటు కొత్తగా డేవిడ్ వార్నర్, మహ్మదుల్లా కూడా ఆడనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి యూఏఈకి టోర్నీ మారడం ద్వారా అభిమానులకు సరికొత్త అనుభూతి లభిస్తుందని డబ్ల్యూసీఎల్ సీఈఓ హర్షిత్ తోమర్ తెలిపారు.
ఇది అభిమానులకు జ్ఞాపకాలు, వినోదాన్ని అందించే గొప్ప వేదిక అని సహ యజమాని అజయ్ దేవ్‌గన్ వ్యాఖ్యానించారు. కాగా, మొదటి సీజన్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. రెండో సీజన్‌లో పాకిస్తాన్‌పై గెలిచి సౌతాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి. జట్ల పూర్తి వివరాలు, మ్యాచ్‌ల షెడ్యూల్ త్వరలోనే వెల్లడి కానున్నాయి.

