కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా (Khammam) విద్యా చిత్రపటంలో సరికొత్త మైలురాయి ఆవిష్కృతమైంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను చేరువ చేస్తూ రఘునాథపాలెం మండలం జింకలతండా సరికొత్త విద్యా కాంతులకు వేదికగా మారింది. ఇక్కడ 13.10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ‘స్వామి నారాయణ్ గురుకుల పాఠశాల’ (Swaminarayan Gurukul School) పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి బుధవారం ఘనంగా భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణలోనే 5వ విద్యాసంస్థగా రూపుదిద్దుకుంటున్న ఈ గురుకులంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధన అందించనున్నట్లు తెలిపారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనాల్లో విద్యార్థులకు అవసరమైన ఆధునిక వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా పాఠశాలలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా కేటాయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు. దీనివల్ల పేద పిల్లలకు సైతం గ్లోబల్ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
కేవలం పాఠ్యపుస్తకాల విద్యకే పరిమితం కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మానవతా విలువలు నైతికతను పెంపొందించేలా ఇక్కడ విద్యాబోధన సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగు జిల్లాల విద్యార్థులకు కూడా ఈ సంస్థ ఎంతో ప్రయోజనకరంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాల్ల దుర్గాప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్వామి నారాయణ్ గురుకుల్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

