కలం, వనపర్తి: మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి మార్గదర్శకమని, ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వంతో జీవించాలని వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం వనపర్తి గాంధీచౌక్‌లోని మహమ్మదీయ మసీదుతో పాటు పట్టణంలోని రెండో వార్డు మసీదులో నిర్వహించిన కార్యక్రమాలలో (Milad-un-Nabi Celebrations) ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం, బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రేమ, కరుణ, దయ, నిజాయితీ, సహనం, సోదరభావం, పేదల పట్ల ఆదరణ వంటి మానవతా విలువలను ప్రవక్త ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ శాంతి, సామరస్యంతో జీవించాలని బోధించినట్లు తెలిపారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, పేదలకు సహాయం చేయడం, మానవత్వాన్ని చాటడం, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడం ప్రవక్త బోధనలోని ముఖ్య సందేశాలని ఎమ్మెల్యే అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఐకమత్యంతో జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాలను నింపాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.
ఈ కార్యక్రమాలలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఎస్ఎల్ఎన్ రమేష్, నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త, కౌన్సిలర్లు క్రాంతి, పరుశురాం, బి. కృష్ణ, ఏర్పుల రవి, పాల రవి, రఘు, మైనార్టీ నాయకులు రహీం, వక్ఫ్‌బోర్డు సభ్యులు రఫీక్, సలీం, ఆర్టీఏ సభ్యుడు జహంగీర్, ఎన్ఎస్యూఐ నాయకులు అబ్రార్, సమీర్, మైనార్టీ నాయకులు వసీం, ఇర్ఫాన్, జమీల్, ఆయూబ్ ఖాన్, కైసర్ తదితరులు పాల్గొన్నారు.

