డిండి ప్రాజెక్టుపై సర్కారుకు సిపిఎం హెచ్చరిక

కలం, మునుగోడు: డిండి ఎత్తిపోతల పథకానికి (Dindi Lift Irrigation Project) జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని, ప్రాజెక్టును అసలు లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసి నల్లగొండ (Nalgonda) జిల్లాకు న్యాయం చేయాలని సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గట్టుప్పల మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శిక్షణ తరగతులకు ముందు ఎండీ. రబ్బాని పార్టీ జెండాను ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కర్నాటి మల్లేశం అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నీటిని పాలమూరు–రంగారెడ్డి జిల్లాలకు 1.50 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 0.50 టీఎంసీలు అందించాలనే లక్ష్యంతో డిండి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. అయితే డిండి కాల్వకు నీటిని తరలించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్‌కు 437 మీటర్ల లెవెల్ నుంచి నీటిని తరలించే పనులు పూర్తయ్యాయని, కానీ డిండి కాల్వకు 440 మీటర్ల లెవెల్ నుంచి నీటిని తీసుకునేలా నిర్ణయించడం వల్ల 6,000 క్యూసెక్కులకు బదులుగా కేవలం 1,500 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు అసలు లక్ష్యమే దెబ్బతింటుందని పేర్కొన్నారు.

వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ఫ్లోరిన్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు, దేవరకొండ, మునుగోడు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యాలు నెరవేరే పరిస్థితి లేదన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్, రాచకొండ లిఫ్ట్, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా వంటి ప్రణాళికలు కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు వెంటనే స్పందించి నల్లగొండకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కోరారు. ఏదుల రిజర్వాయర్ రెండు వైపులా 437 మీటర్ల ఒకే లెవెల్ నుంచి నీటిని తరలించేలా సాంకేతిక మార్పులు చేపట్టి డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి సామర్థ్యంతో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలు, రైతులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఐక్యంగా ఉద్యమించి జిల్లాకు న్యాయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, మూడు శోభన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, నాంపల్లి చంద్రమౌళి, చాపల మారయ్య, వివిధ మండలాల కార్యదర్శులు ఏర్పుల యాదయ్య, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనంజయ గౌడ్, గట్టుప్పల గ్రామ కార్యదర్శి కర్నాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>