కలం, వరంగల్ బ్యూరో : మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేస్తే .. కొద్దిరోజులల్లో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఆమెకు పరీక్షగా మారనున్నాయా..! అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సస్పెన్షన్ కు గురైన తర్వాత సురేఖ తన మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకుంటారా..! అలా చేస్తే.. వరంగల్ తూర్పు సెగ్మెంట్ కు కూడా ఉప ఎన్నిక వస్తుందా? అనే ప్రశ్నలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కీలక పోరుగా మారే చాన్స్ ఉంటుంది.
ముఖ్యంగా సురేఖ వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తారా..! లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా..! అనే సస్పెన్స్ కూడా నెలకొంది. ఇక సిట్టింగ్ సీటు గెలుపు కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని రచించుకోవాల్సిందేనా..! అనేవి ప్రస్తుతానికి ఊహాగానాల స్థాయిలోనే ఉన్నాయి. ఇంతకూ సురేఖపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ముందుగా తేలాల్సి ఉందనే అభిప్రాయాలు మాత్రమే వ్యక్తమవుతున్నాయి.
బలం నిరూపించుకునేందుకే మొగ్గు
కొండ సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిర్యాదులతో మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఫైనల్ నిర్ణయమే ఉత్కంఠగా మారింది. సురేఖను సస్పెండ్ చేస్తే రాజకీయంగా ఆమె ఏం చేస్తారు? అనేదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఉప ఎన్నికకు సిద్ధమై తమ రాజకీయ బలం నిరూపించుకోవాలని కొండా దంపతులు భావిస్తున్నట్లు, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలన్న ఆలోచనకు ఆమె వర్గీయులు కూడా మొగ్గు చూపుతున్నట్లు ప్రచారంలో ఉంది. జనసేన పార్టీలోకి వెళ్లడమా.! లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్‌కు సవాల్ విసరడమా ? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
మున్సిపల్ పోరుపై వేటు ప్రభావం
మరికొద్ది రోజుల్లో వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సురేఖ (Konda Surekha) పరిణామం కాంగ్రెస్‌కు మరింత కీలకంగా మారింది. ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్తే.. ఎంతమంది స్థానిక నేతలు, అనుచరులు వెళ్తారనేదే ఇప్పుడు పార్టీలో ప్రధాన ప్రశ్నగా ఉంది. ముఖ్యంగా కొండా వర్గం తమ అనుచరులను డివిజన్ స్థాయిలో బరిలోకి దింపితే.. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.
ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వారే.. రేపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బరిలో నిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే గుబులు రేపుతోంది. తూర్పు సెగ్మెంట్ లో ఒక్కో డివిజన్‌లో కొండా వర్గం అభ్యర్థులు బరిలోకి దిగితే కాంగ్రెస్ ఓట్లు చీలే చాన్స్ ఉందని, దాని ప్రభావం మొత్తం కార్పొరేషన్ ఫలితాలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదలైన భవిష్యత్ లెక్కలు
అధిష్ఠానం నిర్ణయం వెలువడకముందే తూర్పు సెగ్మెంట్ లో కాంగ్రెస్‌లో భవిష్యత్ రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. సురేఖపై చర్య తీసుకుంటే ఇప్పటి వరకు ఆమెకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తమ ఆధిపత్యాన్ని పెంచుకునే చాన్స్ ఉంది. అదే సమయంలో కొండా వర్గం తమ ఉనికిని చాటుకునేందుకు స్థానిక ఎన్నికలను వేదికగా కూడా మార్చుకోవచ్చనే చర్చ నడుస్తోంది.
పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలా? లేక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికల వరకు సమన్వయం చేయాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న క్లిష్టమైన ప్రశ్న. మొత్తంగా సురేఖపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయం ఒక మంత్రి భవిష్యత్‌ను మాత్రమే నిర్ణయించదని, వరంగల్ తూర్పులో పార్టీ ఆధిపత్యం, కొండా వర్గం సత్తా, రాబోయే మున్సిపల్ ఎన్నికల గెలుపు లెక్కలపై ప్రభావం చూపించ వచ్చనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు వరంగల్ రాజకీయ వర్గాల చూపంతా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉందనే టాక్ వినిపిస్తోంది.

