యూనిఫాం ‘మెరుపు’.. చిన్నారుల మురిపెము!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ విద్యా సంస్థల్లో ఈ ఏడాది అందిస్తున్న యూనిఫాంలు విద్యార్థుల ముఖాల్లో కొత్త కాంతులను నింపుతున్నాయి. కేవలం దుస్తులు పంపిణీ చేయడమే కాకుండా, నాణ్యతకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన ఈ యూనిఫాంలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఒకవైపు విద్యార్థుల మురిపెం, మరోవైపు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కలబోతగా ఖమ్మం జిల్లా విద్యాశాఖలో ఒక ‘వస్త్ర విప్లవం’ స్పష్టంగా కనిపిస్తోంది. ​

వస్త్రం ఎంపిక నుంచి కుట్టింపు పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ అధికారులు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థులకు రోజంతా సౌకర్యవంతంగా ఉండేలా సరైన కొలతలు, చక్కటి ఫిట్టింగ్‌తో వీటిని సిద్ధం చేశారు. కొత్త దుస్తులు ధరించి బడిబాట పడుతున్న చిన్నారులు వాటి సౌకర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఉపాధ్యాయులు కూడా ఈ మార్పుపై సంతృప్తి చెందుతున్నారు. పక్కా కొలతలతో కుట్టిన ఈ దుస్తులు విద్యార్థులలో ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా, అందరినీ ఒక్కటిగా నిలిపి సమానత్వ భావనను పెంపొందిస్తున్నాయి.

​ఈ వస్త్ర విప్లవం వెనుక గ్రామీణ మహిళా శక్తి కీలక భూమిక పోషిస్తోంది. యూనిఫాంల తయారీ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించడంతో పల్లెల్లో ఆర్థిక చైతన్యం వెల్లివిరుస్తోంది. తమ సొంత పిల్లలకు కుట్టినట్లే ప్రత్యేక శ్రద్ధతో ఫిట్టింగ్, కుట్టుపని నాణ్యతపై శ్రద్ధ చూపుతున్న మహిళలు, ఒకవైపు విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందిస్తూనే, మరోవైపు స్థానికంగా నిరంతర ఉపాధిని పొందుతూ కుటుంబ ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ​జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మార్గదర్శకత్వంలో DRDA-SERP, విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 68,387 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 34,850 యూనిఫాంల కుట్టింపు పూర్తయి, అందులో 32,580 దుస్తులను ఇప్పటికే విద్యార్థులకు పంపిణీ చేశారు. ​ప్రత్యేకించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, వివిధ సంక్షేమ విద్యా సంస్థల్లో 20,634 మందికి గాను ఇప్పటికే 19,580 మందికి పంపిణీ పూర్తికాగా, జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో 43,775 మంది లక్ష్యానికిగాను 13,000 మందికి దుస్తులు అందాయి.

మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలోనే అందించేలా పనులు వేగంగా సాగుతున్నాయి. విద్యార్థుల ముఖాల్లో విరిసే చిరునవ్వులే కొలమానంగా సాగుతున్న ఈ కార్యక్రమం, విద్యార్థుల సంక్షేమాన్ని మహిళా సాధికారతను ఒకే వేదికపైకి తెచ్చిన ఆదర్శవంతమైన విజయగాథగా నిలుస్తోందనే అభిప్రాయాలు జిల్లా వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>