కలం, కరీంనగర్ బ్యూరో: సైదాపూర్ (Saidapur) మండలంలో నిర్వహించిన “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) విస్తృతంగా పర్యటించారు. సర్వాయిపేట, పెర్కపల్లి, గొల్లగూడెం, ఆకునూరు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సర్వాయిపేట(Sarvaipet)లో రూ.4.5 కోట్లతో చేపడుతున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్, మ్యూజియం, విగ్రహ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. సర్వాయిపేట కోటను కూడా పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. అనంతరం సర్వాయిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. వివిధ గ్రామాలలో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
రూ.11.5 కోట్లతో రహదారి పనులు
జడ్పీ రోడ్డు నుంచి సర్వాయిపేట, పెర్కపల్లి, ఆకునూరు మీదుగా వెంకటేశ్వరపల్లి వరకు రూ.11.5 కోట్లతో చేపడుతున్న రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు రహదారి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
బీసీల సాధికారతే లక్ష్యం
బి.పి. మండల్ జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘జీరో డెత్’ లక్ష్యం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘జీరో డెత్’ లక్ష్యంతో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి (Minister Ponnam) తెలిపారు. ప్రమాదాలలో గాయపడిన వారిని సకాలంలో కాపాడే వారికి ‘రహవీర్’ పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు.
Also Read : భద్రాద్రిలో నేత్ర పర్వంగా పవిత్రోత్సవాలు
Follow Us On: X(Twitter)

