కలం, జోగులాంబ గద్వాల: మల్దకల్ మండలం పాల్వాయి గ్రామ ఓటర్లు (Palwai Voters) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గ్రామస్తులతో కలిసి మాజీ సర్పంచ్ శివరామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆర్. ఎల్లప్ప మల్దకల్ తహసీల్దార్ ఝాన్సీరాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పాల్వాయి గ్రామానికి చెందిన 140 ఓట్లను పావనం పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బూత్ నంబర్ 191కు బదిలీ చేయడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పాల్వాయి నుంచి పావనంపల్లికి సుమారు 5 కిలో మీటర్ల దూరం ఉండటంతో ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం గ్రామస్తులకు ఎంతో కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఓట్లు ఇతర పంచాయతీకి మారడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడంలో కూడా పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల నాటికైనా ఈ 140 ఓట్లను తిరిగి పాల్వాయి గ్రామంలోని బూత్ నంబర్లు 180, 189, 190 పరిధిలోకి మార్చాలని రెవెన్యూ అధికారులను కోరారు.

