కలం, వెబ్‌డెస్క్: చెత్త కుప్పలో ఉన్న చాక్లెట్లను జనం ఎగబడి మరీ తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని కాన్పూర్ మున్సిపల్‌లో జరిగింది. డేట్ అయిపోయిన చాక్లెట్ల (Expired Chocolates)ను ఓ ఫ్యాక్టరీ యజమాని చెత్తకుప్పలో పడేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అసలు ఆ చాక్లెట్లను ఎందుకు చెత్తకుప్పలో పడేశారని ఆలోచించకుండా డబ్బాలన్నీ సంచుల్లో నింపుకోవడం కోసం ఎగబడ్డారు. చదువుకున్న వాళ్లు సైతం పోటీ పడి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎక్స్‌పైర్డ్ చాక్లెట్లను ఎగబడి మరీ తీసుకెళ్లడంపై నెటిజన్లు షాకవుతున్నారు. ఈ చాక్లెట్లను చిన్న పిల్లలకు తినిపిస్తే ఎలా ? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ ఖాసిమ్ అబిది స్పందించారు. డేట్ అయిపోయిన చాక్లెట్లు, లేదా ఇతర తినుబండారలను తింటే ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చాక్లెట్లను అక్కడ పడేసిన కంపెనీ యాజమాన్యాన్ని విచారిస్తామని స్పష్టం చేశారు.

