కలం, నిజామాబాద్ బ్యూరో : నశాముక్త సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాల ప్రభావానికి యువత దూరంగా ఉండి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, నవకల్పన, దేశసేవ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి’ గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘నశాముక్త భారత్ అభియాన్’ విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు . మాదకద్రవ్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు యువతలో అవగాహన, చైతన్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కూడా ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన EAGLE కార్యక్రమంతో పాటు పోలీసుశాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులను చైతన్యవంతం చేయడం మంచి ప్రయత్నమని అన్నారు.
విద్యాసంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాల, హానికర పదార్థాల లభ్యతను నియంత్రించడంతో పాటు చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నశాముక్త సమాజం కోసం పోలీసు, యంత్రాంగం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ సూచించారు. నిజామాబాద్ పోలీసులు చేపడుతున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, సమర్థవంతమైన అమలు చర్యలు ప్రశంసనీయమని అన్నారు.
యువతే దేశానికి బలం
‘యువతలోని శక్తి, ప్రతిభ, కలలే దేశానికి అతిపెద్ద సంపద అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాలకు బలి చేయొద్ధని గవర్నర్ విద్యార్థులకు సూచించారు. స్వామి వివేకానంద పిలుపైన ‘లేచి నిలబడండి.. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అనే సందేశాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.లోహంలాంటి కండరాలు, ఉక్కులాంటి నరాలు, వజ్రంలాంటి సంకల్పం కలిగిన యువత దేశానికి అవసరమన్నారు. అటువంటి అంకితభావం కలిగిన కొద్దిమంది యువకులు కూడా దేశంలో, ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకురాగలరని పేర్కొన్నారు.
ఆసక్తి, క్షణిక ఆకర్షణ కారణంగా యువత జీవితం తప్పుదారి పట్టే అవకాశం ఉందని గవర్నర్ హెచ్చరించారు. ప్రతి యువకుడు విచక్షణ, ఆత్మనియంత్రణను జీవితానికి మార్గదర్శకంగా చేసుకోవాలని సూచించారు. మిత్రుల్లో ఎవరైనా నశా వైపు వెళ్తున్నట్లు గుర్తిస్తే వారిని ఒంటరిగా వదిలేయకుండా మార్గదర్శనంతో సరైన దారిలోకి తీసుకురావాలని అన్నారు. ‘నశాకు నో.. జీవితానికి ఎస్’ అనే నినాదం కేవలం నినాదంగా కాకుండా ప్రతి యువకుడి జీవిత సంకల్పంగా మారాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర
పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం సంభాషిస్తూ నమ్మకం, ఆప్యాయతతో వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా తాను పనిచేసిన సమయంలో నశా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని స్వయంగా చూశానని తెలిపారు. యువత, కుటుంబాలు, విద్యాసంస్థలు, స్థానిక సమాజం కలసికట్టుగా పనిచేస్తే సామాజిక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. తెలంగాణలోనూ ‘నశాముక్త భారత్ జన ఆందోళన్’ లో భాగంగా జూన్ 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల సమక్షంలో విద్యార్థులతో నశాముక్త జీవితం కోసం ప్రతిజ్ఞ చేయించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు.
నిజామాబాద్ మరింత అభివృద్ధి చెందాలి
నిజామాబాద్ గొప్ప చరిత్ర, సంస్కృతి, సాహిత్య వారసత్వానికి ప్రతీక అని గవర్నర్ అన్నారు. నిజామాబాద్ వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, సమగ్ర అభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రతి పాఠశాల సురక్షితంగా.. ప్రతి యువత చైతన్యవంతంగా.. ప్రతి కుటుంబం నశా దుష్ప్రభావాల నుంచి రక్షితంగా ఉండేలా సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన యువతే బలమైన సమాజాన్ని నిర్మిస్తుందని, బలమైన సమాజమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
‘నశాముక్త తెలంగాణ.. నశాముక్త భారత్’ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, నగర మేయర్ ఉమారాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య లు పాల్గొన్నారు.

