కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారా అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ విధానాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, అందుకే ‘జెన్జీ’ వంటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లి (Perkapalli) గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం ప్రభాకర్–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నాం
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్మెంట్ అందేలా ముందస్తు చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. రాజకీయ ఉనికిని చాటుకునేందుకే కొందరు నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు కేంద్రం అన్యాయం
తెలంగాణకు రావాల్సిన నిధులు, రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించకుండా అంతర్గత రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, విద్యా మౌలిక వసతుల కల్పన, డైనింగ్ ఛార్జీల పెంపు, ఉపాధ్యాయుల నియామకాలు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, విద్యా రంగ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

