కలం, వెబ్ డెస్క్: జర్మన్ సూపర్ కప్‌లో బొరుస్సియా డోర్ట్ముండ్పై 2-1 తేడాతో విజయం సాధించిన అనంతరం, బైయర్న్ మ్యూనిచ్ కెప్టెన్, దిగ్గజ గోల్‌కీపర్ మాన్యుయెల్ నోయర్ (Manuel Neuer) తన రిటైర్మెంట్పై సంచలన సంకేతాలు ఇచ్చారు. 2026-27 సీజన్ తన సుదీర్ఘ కెరీర్లో చివరిది కావచ్చని ఆయన అంగీకరించారు. ఈ టోర్నీలో ఇది తన చివరి మ్యాచ్ కావచ్చా అని అడగ్గా, కావచ్చు అని సమాధానమిచ్చారు. అలాగే ఈ సీజన్ ముగిసేసరికి ఆట నుంచి తప్పుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు, అది మరింత స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 40 ఏళ్ల ఈ వెటరన్ గోల్‌కీపర్, ప్రస్తుతం ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మ్యాచ్‌లను ఇదే తన చివరి మ్యాచ్ అనే ఆలోచనతో ఆడటం లేదని, అయితే రిటైర్మెంట్ మాత్రం చాలా దగ్గరగా కనిపిస్తోందని వివరించారు. నిజానికి గతంలోనే రిటైర్ అవ్వాలని అనుకున్నప్పటికీ, జట్టులోని నాణ్యత, కోచింగ్ సిబ్బంది మద్దతు, ట్రోఫీలు గెలిచే అవకాశాలు ఉండటంతో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2027తో ముగియనున్న తన ఒప్పందాన్ని పొడిగించే ఆలోచన లేదని ప్రీ-సీజన్ క్యాంప్‌లోనే ఆయన స్పష్టం చేశారు. నోయర్ ప్రస్తుతం తన 21వ బుండెస్లిగా సీజన్లో అడుగుపెడుతున్నారు.
2011లో బైయర్న్ మ్యూనిచ్‌లో చేరిన ఆయన, జట్టుతో అనేక బుండెస్లిగా, ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుచుకుని ప్రపంచ అత్యుత్తమ గోల్కీపర్లలో ఒకరిగా నిలిచారు. తన కెరీర్‌ను మరో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీతో ముగించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు బైయర్న్ మ్యూనిచ్ యాజమాన్యం నోయర్ అనంతర కాలం కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. 23 ఏళ్ల జానాస్ అర్బిగ్ను ఆయన వారసుడిగా భావిస్తోంది. ఇద్దరు గోల్‌కీపర్ల మధ్య రొటేషన్ పద్ధతిని అమలు చేస్తూ, అర్బిగ్కు క్రమంగా బాధ్యతలు పెంచి, ప్రధాన గోల్‌కీపర్‌గా తీర్చిదిద్దాలని క్లబ్ నిర్ణయించింది.

