కరీంనగర్‌లో అర్ధరాత్రి సీపీ సర్‌ప్రైజ్ చెకింగ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం (Karimnagar CP) అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. నగరంలో అర్ధరాత్రి హంగామా సృష్టిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11 గంటల తర్వాత హోటళ్లలో క్రయవిక్రయాలు సాగుతున్నాయని, గొడవలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న సీపీ శనివారం అర్ధరాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సర్ ప్రైజ్ చెకింగ్ చేపట్టారు. కరీంనగర్‌లోని శనివారం అంగడి రైతు బజార్, బైపాస్ రోడ్, రాజీవ్ చౌక్, తెలంగాణ చౌక్ తదితర ప్రాంతాల్లో సీపీ ఆకస్మికంగా పర్యటించారు.

​రాత్రి 11 గంటల తర్వాత హోటళ్లు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైతు బజార్ లో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న సీపీ అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రి వేళల్లో హోటళ్లు, వ్యాపారాలు కొనసాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌ను తనిఖీ చేసిన సీపీ అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు సాగించడం ఏంటని నిలదీశారు. సదరు బార్ యాజమానికి నోటీసులు ఇవ్వాలని అయినా మార్పు రానట్లయితే రెస్టారెంట్‌ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

​రాజీవ్ చౌక్ లో ఓ టీస్టాల్ వద్ద ఆగిన సీపీ షాపు క్లోజ్ చేశామని హోటల్ నిర్వాహకుడు చెప్పగానే షటర్ తీసి తనిఖీ చేశారు. లోపల డికాషన్ తయారు చేస్తున్నట్టుగా గమనించి అతన్ని తీవ్రంగా మందలించారు. బైపాస్ రోడ్‌లోని ఓ దాబా వద్దకు చేరుకున్న సీపీ గౌష్ ఆలం నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బ్లూకోట్ పోలీసులు అర్ధరాత్రి దాబా నడుస్తున్నదని ఫోటోలు తీస్తే వారిని వెంటాడి బైక్ కీస్ లాక్కుని ఫోటోలను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారన్న విషయంపై సదరు దాబా ఓనర్ పై సీరియస్ అయ్యారు సీపీ. ఇలాగే వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అర్ధరాత్రి దాటిన తరువాత దాబా నడిపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

​తెలంగాణ చౌక్‌లో కూడా తనిఖీలు నిర్వహించిన సీపీ పలువురికి హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే సీపీ ఆకస్మిక తనిఖీల గురించి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ముందే లీక్ చేయడంతో హోటళ్లను క్లోజ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆయన అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత యథావిధిగా షాపులు నడిపించినట్టుగా తెలుస్తోంది. తరచూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>