కలం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి (Meenakshi Natarajan) నటరాజన్ ఎక్కడ?.. అంటూ కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను ఏకవచనంతో పరుష పదాలతో దూషించినా మంత్రుల్లో చలనం లేదని ఇప్పటివరకూ ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా మీనాక్షిపైనా అసంతృప్తి నెలకొన్నది. మరోవైపు రెండు రోజులుగా గాంధీభవన్, సీఎల్పీ ఆఫీసులు పార్టీ నేతలతో, ఎమ్మెల్యేల ప్రెస్మీట్లతో అట్టుడికిపోతూ ఉంటే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నిజామాబాద్‌లో ఉండడం, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లో పాల్గొనడం కూడా పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. గత కొన్ని నెలలుగా పార్టీలోని కొందరు నేతలు ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తూ ఉంటే కట్టడి చేయని కారణంగానే ఇప్పుడు పరిస్థితి ఈ స్థాయికి చేరుకుందన్న ఆవేదన నేతల్లో వ్యక్తమవుతున్నది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి డిమాండ్
ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు మహిళా నేతలు కొండా సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ గీత దాటేవారిని ఉపేక్షించొద్దని, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌కు స్పష్టం చేశారు. అలాగే పలువురు విప్‌లు సైతం కొండా సురేఖ మౌనాన్ని ప్రశ్నించారు. కూతురు సుష్మిత పరుష పదాలతో సీఎంను విమర్శిస్తూ ఉంటే తల్లిగా, మంత్రిగా కొండా సురేఖ ఎందుకు మౌనంగా ఉన్నారని మహిళా కాంగ్రెస్ నేతలు కూడా తప్పుపట్టారు. క్రమశిక్షణా కమిటీ కఠినంగా వ్యవహరించాలని, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్ రెడ్డి తదితరుల పేర్లను కూడా ఆ నేతలు ప్రస్తావించారు. దాదాపు ముప్పై మంది నుంచి డిమాండ్లు తలెత్తుతున్న పరిస్థితుల్లో ఎంపీ మల్లురవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశమై ఇప్పటివరకు వచ్చిన వివరణలను పరిశీలించింది. తదుపరి చర్యలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నది.
మీనాక్షి తీరుపై అసంతృప్తి
మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నుంచి ఎలాంటి మెసేజ్ రాకపోవడం వారిని విస్మయానికి గురిచేస్తున్నది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, దానికి సురేఖ రిప్లై ఇవ్వడం, ఆ తర్వాతి పరిణామాలతో మరో లేఖ రాయడం.. ఇవన్నీ జరుగుతున్నా ఇన్చార్జి హోదాలో మీనాక్షి ఇచ్చే మెసేజ్ ప్రభావం చూపుతుందని, కానీ పట్టీపట్టనట్లు వ్యవహరించడం, హైదరాబాద్‌కు రాకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. గత కొద్ది నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి బహిర్గతమవుతున్నా మీనాక్షి నటరాజన్ మెతక వైఖరి పనిచేయలేదనే మాటలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. పార్టీ లైన్ తప్పినవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉంటే కొండా సుష్మిత నేరుగా సీఎంపైనే విరుచుకుపడి ఉండేవారు కాదని, పరిస్థితి ఈ స్థాయికి చేరుకునేది కాదన్నది లీడర్ల వాదన. ఏఐసీసీకి, పీసీసీకి మధ్య వారధిగా ఉండి పార్టీలోని పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తదనుగుణంగా వ్యవహరించడంలో మీనాక్షి నటరాజన్ శక్తి సరిపోవడం లేదన్న మాటలూ వినిపిస్తున్నాయి.
నిజామాబాద్‌కే పీసీసీ చీఫ్ పరిమితం
- కొండా సుష్మిత వ్యాఖ్యలు, ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ తీరుపై పార్టీలో గందరగోళం నెలకొన్నా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్‌గా లేరన్న భావన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులో నెలకొన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై మంది మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ఆయన నుంచి మెసేజ్ లేదని, నాన్చివేత ధోరణిలో ఉంటున్నారని శ్రేణులు అంటున్నాయి.
- హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ప్రజాప్రతినిధులు, క్రమశిక్షణా కమిటీ సమావేశాలతో హడావుడి నెలకొంటే పీసీసీ చీఫ్ రెండు రోజులుగా నిజామాబాద్‌కే పరిమితమయ్యారని, షాపుల ఓపెనింగ్‌లలో నిమగ్నమయ్యారని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
- ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వస్తున్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం దెబ్బతిన్నప్పుడు, వీరిద్దరూ ముందస్తు హెచ్చరికలతో పరిస్థితులను చక్కదిద్దాల్సి ఉంటుందని కొందరు లీడర్లు గుర్తుచేస్తున్నారు. కానీ, అలాంటి పాత్ర ఇద్దరి నుంచి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఎక్కడో ఉండి నివేదికలు కోరడానికి, హైదరాబాద్ వచ్చి పరిస్థితులను సమీక్షించడానికి తేడా ఉంటుందని నాయకులు అంటున్నారు.
బాధ్యత ఎవరు తీసుకుంటారు?
రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో ఇంత గందరగోళం నెలకొంటే బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న మీనాక్షి, మహేశ్ గౌడ్ ఇద్దరూ సరైన చొరవ తీసుకోకపోవడం వల్లనే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని పార్టీ శ్రేణుల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారన్నది కీలకంగా మారింది. పార్టీలో క్రమశిక్షణను కాపాడటంలో ఇద్దరూ విఫలమయ్యారనే భావన కొందరు నేతల్లో నెలకొన్నది. కొండంత వివాదం రాజుకుంటున్నా ఢిల్లీ నుంచి చూస్తూ ఉండిపోయిన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని తిరుగుబాటు స్వరాలకు ఊపిరిపోసే ప్రమాదం ఉందన్నది ఆ నేతల మాటల ద్వారా వ్యక్తమవుతున్నది.

