కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులకు పిడుగులాంటి వార్త ఇది. హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజుల పెంపు ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయ్యింది. ఓఐఆర్‌ఏ (ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్) కూడా క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ప్రతిపాదన తదుపరి దశకు చేరుకున్నది. డీహెచ్‌ఎస్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ) త్వరలో ప్రతిపాదిత నిబంధనను విడుదల చేయనుంది. ప్రజాభిప్రాయాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది నిబంధన జారీ చేసి.. ఆ తర్వాత కొత్త ఫీజులను అమల్లోకి తీసుకురానున్నారు.
హెచ్ 1 బీ వీసాల పెంపు ప్రక్రియ ఇలా ..
డీహెచ్‌ఎస్ హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజులను పెంచే ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది. ఆ ప్రతిపాదనను వైట్‌హౌస్‌లోని ఓఐఆర్‌ఏ పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఈ సమీక్ష పూర్తై క్లియరెన్స్ వచ్చింది. అనంతరం డీహెచ్‌ఎస్ ప్రతిపాదిత నిబంధనను బహిరంగంగా విడుదల చేస్తుంది. అప్పుడే ఫీజు ఎంత పెంచుతారు, ఎవరికి వర్తిస్తుంది వంటి పూర్తి వివరాలు తెలుస్తాయి.
కంపెనీలు, ఉద్యోగులు, ఇతర వర్గాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం ఉంటుంది. వచ్చిన అభిప్రాయాలను డీహెచ్‌ఎస్ పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తుంది. చివరగా డీహెచ్‌ఎస్ తుది నిబంధనను జారీ చేస్తుంది. తుది నిబంధనలో పేర్కొన్న తేదీ నుంచి కొత్త హెచ్-1బీ ఫీజులు అమల్లోకి వస్తాయి.
ఫీజు పెంపుపై నో క్లారిటీ
ప్రస్తుతం ప్రతిపాదనలోని పూర్తి వివరాలు బహిరంగంగా అందుబాటులో లేవు. దీంతో ఫీజు ఎంత పెంచుతారు, ఏ రకమైన హెచ్-1బీ పిటిషన్లకు కొత్త ఫీజులు వర్తిస్తాయి, మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? అనే విషయాలపై స్పష్టత లేదు. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కఠినంగా, ఖర్చుతో కూడినదిగా మార్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. కొత్త హెచ్-1బీ ఉద్యోగులకు కొన్ని సందర్భాల్లో 1 లక్ష డాలర్ల ఫీజు విధించే చర్యను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టివేయగా.. ప్రభుత్వం ఆ తీర్పును సవాలు చేసింది.
అదనపు ఫీజు వర్తింపు
కొన్ని సంస్థలకు హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్లపై అదనపు ఫీజులు విధించేలా నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు ఉండి, వారిలో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 హోదాలో ఉన్న సంస్థలకు ఈ అదనపు ఫీజులు వర్తించనున్నాయి. హెచ్-1బీ పిటిషన్లకు 4,000 డాలర్లు, ఎల్-1 పిటిషన్లకు 4,500 డాలర్ల అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
భారతీయ నిపుణులపై ప్రభావం
హెచ్-1బీ లో భారతీయ నిపుణులదే అత్యధిక వాటా. అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (USCIS) గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,06,348 హెచ్-1బీ పిటిషన్లకు అనుమతులు లభించాయి. వీటిలో 2,91,542 అనుమతులు ఇప్పటికే హెచ్-1బీపై ఉన్న ఉద్యోగుల కొనసాగింపు ఉద్యోగాలకు సంబంధించినవి. ఈ కొనసాగింపు ఉద్యోగాల అనుమతుల్లో 2,26,359 భారతీయులకు లభించాయి.
అంటే మొత్తం కొనసాగింపు ఉద్యోగాల హెచ్-1బీ అనుమతుల్లో భారతీయుల వాటా 77.6 శాతంగా ఉంది. అందువల్ల హెచ్-1బీ పిటిషన్లకు ఫీజులు పెరిగితే భారతీయ నిపుణులను పెద్ద సంఖ్యలో నియమించుకునే అమెరికా కంపెనీలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. టెక్నాలజీ రంగంలోని సంస్థలపై దీని ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి భారతీయ హెచ్-1బీ ఉద్యోగులపై కొత్త ఫీజు అమల్లోకి రాలేదు. ప్రతిపాదనలోని పూర్తి వివరాలు, ఫీజుల పెంపు ఎంత మేరకు ఉంటుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశాలు డీహెచ్‌ఎస్ తుది నిబంధన విడుదల చేసిన తర్వాతే స్పష్టమవుతాయి.

