రామయ్య దర్శనానికి సరికొత్త మార్గం.. భద్రాచలానికి నేరుగా రైల్వే లైన్!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల దశాబ్దాల కల త్వరలో నెరవేరబోతోంది. ఇప్పటివరకు రామయ్య దర్శనానికి రైళ్లలో వచ్చే భక్తులు భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి 40 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. ఈ తిప్పలకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నేరుగా భద్రాచలం క్షేత్రానికే రైలు సౌకర్యం కల్పించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన ప్రణాళికతో ఇకపై రాములోరి ఆలయం వద్దకే నేరుగా రైలు ప్రయాణం సాధ్యం కానుంది.

రూ.2,900 కోట్లతో రైల్వే కారిడార్!

భద్రాద్రి జిల్లా రూపురేఖలు మార్చనున్న మెగా ప్రాజెక్టు సుమారు రూ.2,900 కోట్ల అంచనా వ్యయంతో పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు ఈ కొత్త హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను నిర్మించనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా, ఎలాంటి లెవల్ క్రాసింగ్‌లు లేకుండా అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ఈ మార్గాన్ని అధికారులు డిజైన్ చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానించే ఈ కారిడార్ లో భద్రాద్రి జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక, రవాణా స్వరూపాన్నే మార్చివేసేలా నిలవనుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయి ఐదేళ్లలో అంటే 2031 నాటికి మెగా ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

గోదావరిపై మరో వారధి

రైల్వే ప్రాజెక్టుతో ఏజెన్సీ ప్రాంతం సరికొత్త వికాసానికి నాంది పలకబోతుండగా.. గోదావరి నదిపై భారీ రైల్వే వంతెన రానుంది. 1974లో రాజమండ్రి వద్ద నిర్మించిన బ్రిడ్జి తరహాలోనే, భద్రాచలం వద్ద గోదావరిపై కొత్త వారధి రూపుదిద్దుకోనుంది. దీనితో పాటు ప్రాజెక్టు పొడవునా 300 వంతెనలు, 41 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 66 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించనుంది. చింతూరు, కూనవరం వంటి వెనుకబడిన అటవీ ప్రాంతాల మీదుగా సాగే ఈ రైలు మార్గం ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు రవాణా సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తెస్తూ సరికొత్త వికాసానికి బాటలు వేయనుంది.

కొత్త రైల్వే డివిజన్ గా కొత్తగూడెం!

రైల్వే ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ గురువారం సికింద్రాబాద్ రైల్‌ నిలయంలో జరిగిన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశంలో పలువురు కీలక అంశాలను జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో సికింద్రాబాద్ జోన్‌లో హైదరాబాద్ ఒక్కటే డివిజన్‌గా ఉన్నందున, సుదీర్ఘ చరిత్ర కలిగిన కాజీపేట జంక్షన్‌తో పాటు భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్‌ను కొత్త రైల్వే డివిజన్లుగా ప్రకటించాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

అంతేకాకుండా కొత్తగూడెం నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును కేటాయించాలని, సికింద్రాబాద్ – బెలగావి ఎక్స్‌ప్రెస్‌ను మణుగూరు వరకు పొడిగించడంతో పాటు కాజీపేట్–మణుగూరు ప్యాసింజర్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఈ కొత్త రైల్వే లైన్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనుసంధానించడం ద్వారా రామయ్య భక్తులతో పాటు ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.

మొత్తంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, అంతర్రాష్ట్ర అనుసంధానం కలబోతగా రూపుదిద్దుకుంటున్న ఈ హైస్పీడ్ కారిడార్ భద్రాద్రి జిల్లా భవిష్యత్తుకు సరికొత్త దిశను నిర్దేశిస్తుందని జిల్లా ప్రజలతో పాటు భక్తులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>