కలం, కరీంనగర్ బ్యూరో: పుట్టెడు దుఃఖంలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలిచే ఉచిత పార్థివ దేహ వాహన (మహాప్రస్థానం) సేవలు జిల్లాలో (Karimanagar) సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిచిపోయే ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆత్మీయులను కోల్పోయిన పేదలు, మృతదేహాన్ని స్వగ్రామాలకు తరలించలేక పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ అంబులెన్సులు వేల రూపాయలు గుంజుతున్న తరుణంలో 2016 నవంబర్‌లో ప్రభుత్వం 50 ఉచిత పార్థివ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ టెండర్ ద్వారా ఈ సేవల నిర్వహణ బాధ్యతలను చేపట్టింది.
నిధుల కొరతతో కుదేలవుతున్న నిర్వహణ
గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ సేవలకు సంబంధించిన నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఫండ్స్ రాకపోవడంతో వాహనాల నిర్వహణ, డీజిల్ ఖర్చులు, అత్యవసర మరమ్మతులు భారం కాగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న డ్రైవర్లు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదు. “ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం” అన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, నిత్యం పేదల సేవలో ఉండే తమ పొట్ట కొడుతున్నారని వాహన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి నిర్వహణ సంస్థ నోటీసులు
బకాయిలు చెల్లించాలని అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఇక సేవలు కొనసాగించడం తమ వల్ల కాదని నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నెల రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సెప్టెంబర్ 1 నుంచి సేవలను (Mahaprasthanam Services) పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే తరహాలో 108 (అత్యవసర అంబులెన్స్), 102 (తల్లి-పిల్లల రవాణా) సేవల నిర్వహణకు కూడా నిధుల కొరత తీవ్రమై, భవిష్యత్తులో అవి కూడా స్తంభించిపోయే సూచనలు కనిపిస్తున్నాయని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
మానవీయ కోణంలో స్పందించాలి
అనుకోని విపత్తు వచ్చి ఆప్తులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న పేద కుటుంబాన్ని ఆర్థికంగా గుల్ల కాకుండా కాపాడేది ఈ పార్థివ వాహనాలే. ఈ సేవలు ఆగిపోతే మృతదేహాలను తరలించడానికి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు అడిగినంత ఇవ్వలేక పేదలు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడతారు. పాలకుల అలసత్వం వల్ల నిరుపేదలకు అందించే సంక్షేమ సేవలు ఆగిపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. సిబ్బందికి బకాయి జీతాలు చెల్లించి సెప్టెంబర్ 1 నుంచి ఉచిత పార్థివ వాహన సేవలు అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

