కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) భగత్ నగర్ లోని Z.P క్వార్టర్స్‌లో గల ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లో “తెలంగాణ ఊళ్లళ్ల-పట్నాల్ల ముచ్చట్లు”పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సమైక్య సాహితీ సంస్థ ఆధ్వర్యంలో రచయిత ఎన్.సంపత్ కుమార్ రచించిన 50వ పుస్తకం ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత గర్రెపెల్లికి చెందిన దూరిశెట్టి రామయ్యని సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ప్రతి పదేళ్లకు ఒకసారి ఎంతో శ్రమించి, పరిశోధించి పుస్తకాలు రాసి సమాజానికి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పుస్తకాలు చదవడమే కాకుండా, ఆసక్తి ఉన్న ఇతరులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేటి తరం సాంకేతికతకు దగ్గరగా ఉంటున్నందున, పుస్తకాలను ప్రింట్ రూపంలోనే కాకుండా స్మార్ట్‌ఫోన్లలో చదువుకోవడానికి వీలుగా సాఫ్ట్ కాపీలు గానూ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాబోయే రోజుల్లో 50 కి పైగా పుస్తకాలను ఇదే రీతిలో డిజిటలైజ్ చేయాలని సూచించారు.
నేటి ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో, పిల్లలకు పూర్వీకుల గొప్పతనం, సంస్కృతి, భాషా గొప్పతనం తెలియజేసే బాధ్యత రచయితలు, కవులపైనే ఉందన్నారు. కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లైబ్రరీలో పూర్తి స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి, రాబోయే వందల ఏళ్ల పాటు పాఠకులకు పుస్తకాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సినారె (సి.నారాయణరెడ్డి) లాంటి మహోన్నత కవులు నడియాడిన కరీంనగర్ గడ్డపై, ఆ సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, పుస్తక రచయిత సంపత్ కుమార్, దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్, సీనియర్ సిటిజన్స్ వైస్ ప్రెసిడెంట్ మోసం అంజయ్య, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ బి.వి.ఎన్. స్వామి, సమైక్య సాహితీ సంస్థ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్, సమక్య సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. అనంతాచార్య, పద్మశ్రీ పురస్కార గ్రహీత దూరిశెట్టి రామయ్య, కాండ్లూరి వెంకటేశ్వర్లు, పరశురామారావు, గజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

