షావుకారు జానకి మృతి.. ప్రముఖుల సంతాపం

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటి షావుకారు జానకి (Sowcar Janaki) మృతి చెందడంపై రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి కన్నుమూశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు తమిళనాడు, కన్నడకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆమె కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. జానకి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు లోటుగా పేర్కొన్నారు.

దిగ్భ్రాంతి కలిగించింది: చంద్రబాబు, ఏపీ సీఎం

షావుకారు జానకి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. 400కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారని కొనియాడారు. ఆమె భౌతికంగా దూరమైనా.. తాను నటించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. జానకి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

అసమాన ప్రతిభతో చెరగని ముద్ర: రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం

చిన్నప్పటి నుంచే నాటకాల్లో ప్రదర్శిస్తూ కెరీర్ ప్రారంభించిన షావుకారు జానకి 70 ఏళ్ల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నటించిన మొదటి సినిమా ‘షావుకారు’ పేరుతోనే ప్రాచుర్యం పొందిన ఆమె.. అసమాన ప్రతిభతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 400కి పైగా చిత్రాల్లో నటించారని వివరించారు. చిత్ర పరిశ్రమకు ఆమె లేని లోటు పూడ్చలేనిదన్నారు.

జానకి మృతితో షాకయ్యా: విజయ్, తమిళనాడు సీఎం

అద్భుతమైన నటనా నైపుణ్యంతో కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపజేసిన షావుకారు జానకి మరణించారనే వార్త తెలిసి షాకయ్యానని సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల పాటు వివిధ పాత్రల్లో ఆమె నటించిన తీరు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి మెప్పించారని కొనియాడారు. పద్మ శ్రీ, కలైమామని, నంది వంటి అత్యున్నత అవార్డులను సొందం చేసుకున్నారు. ఆమె లేని లోటు చిత్ర పరిశ్రమలో పూడ్చలేనిదని స్పష్టం చేశారు.

సినిమా పేరునే ఇంటి పేరుగా: పవన్ కళ్యాణ్​, ఏపీ డిప్యూటీ సీఎం

షావుకారు జానకి మరణించారని తెలిసి చింతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్​ తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, షావుకారు సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని, సుమారు 400 చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించారని కొనియాడారు. జానకి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు వివరించారు.

మన జ్ఞాపకాల్లో నిలిచిపోతారు ముద్ర: జూనియర్ ఎన్టీఆర్

తెలుగుతో పాటు భారత సినీ రంగంలో షావుకారు జానకి తనదైన ముద్ర వేశారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆమె మరణవార్త ఎంతో బాధ కలిగించిందని.. జానకి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>