కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆగస్ట్ సంక్షోభం నెలకొననుందా?.. అటు ప్రభుత్వంలో, ఇటు తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీలో ఊహించని అలజడి తలెత్తనుందా?.. హఠాత్తుగా లండన్ పర్యటన ముగించుకుని సీఎం హైదరాబాద్‌కు ఎందుకు తిరిగి వస్తున్నారు?.. అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణమా?.. ఇలాంటి అనేక సందేహాలు రాష్ట్రంలో నెలకొన్నాయి.
ప్రభుత్వ స్థాయిలో ఏదో అలజడి జరగబోతుందనే సంకేతంతోనే ఒకేసారి 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారనే మాటలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి టార్గెట్‌గా గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె.. అంశాలు, వేర్వేరు ఘటనలు అయినా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో అసమ్మతికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయాలకు చుక్కెదురు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు అటు ప్రజల్లో, ఇటు విపక్ష పార్టీల్లో చర్చనీయాంశం కాగా తాజాగా న్యాయస్థానాలు సైతం తప్పుపడుతున్నాయి. గతంలో హైడ్రా, ఆ తర్వాత కంచె గచ్చిబౌలి భూములు, ఉర్దూ యూనివర్శిటీ భూముల మొదలు తాజాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై నిషేధం వరకు న్యాయస్థానాలు సైతం తీవ్ర స్థాయిలోనే తప్పుపడుతున్నాయి.
ఏ బాధ్యతల్లో ఏ అధికారిని నియమించాలన్న విచక్షణ ప్రభుత్వానికి ఉందనే అంశంలో హైకోర్టుకు భిన్నాభిప్రాయం లేకపోయినా హైడ్రా చీఫ్ రంగనాధ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశం ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సైతం తీవ్ర స్థాయిలోనే మందలించింది. అధికారుల తప్పిదానికి క్షమాపణ చెప్తున్నానంటూ 22-ఏ భూముల వివాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
సొంత పార్టీల నేతల నుంచే వ్యతిరేకత..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఫామ్ హౌజ్ మీటింగ్ పెట్టుకున్న కొద్దిమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చర్చించుకున్నారనే అంశం పీసీసీ దృష్టికి వెళ్లింది. రెండేళ్లుగా సొంత పార్టీ నేతల నుంచే వస్తున్న విమర్శల వెనక ఎవరున్నారనే చర్చ కాంగ్రెస్‌లో బలంగా ఉంది.
ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేలా, నిత్యం చీకాకు పరిచేలా సొంత పార్టీలోనే ఒక వర్గం కుట్ర పన్నుతోందని.. దీనికి విపక్షం కూడా అగ్నికి ఆజ్యం పోస్తుందనే అనుమానాలు లేకపోలేదు. మంత్రుల మధ్య సమన్వయం, సహకారం లేదని దీర్ఘకాలంగా సచివాలయ వర్గాల్లో అధికారుల స్థాయిలోనే ఒక బలమైన అభిప్రాయం ఉంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే అయినా, మంత్రే చెప్పించారన్నది పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం.
20 మంది ఎమ్మెల్యేల మీటింగ్ ఓ సంకేతమా..?
కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఏదో సంక్షోభం జరగబోతుందనే వార్తలు వచ్చిన పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ అంశం బర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించే తీరులో ఉండటంతో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు గతంలో ఎన్నడూ లేని తీరులో సీఎల్పీ ఆఫీసులో మీడియా సమావేశాన్ని నిర్వహించి మంత్రి తీరును తప్పు పట్టారు.
ముఖ్యమంత్రినే టార్గెట్ చేసే తీరులో సుస్మిత వెనక ఆమె తల్లి కొండా సురేఖ ఉన్నారా?.. లేక మంత్రిని ఎవరో వెనక ఉండి రెచ్చగొడుతున్నారనే చర్చ సైతం ఉంది. ఓవైపు ప్రభుత్వ విధాన నిర్ణయాలు అధికారులు ముందుగానే లీక్ చేస్తున్నారని, ప్రభుత్వానికి సహకరించడం లేదనే అభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో మంత్రివర్గంలోనూ గ్యాప్ రావడం ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్ర అనేది కొద్దిమంది పార్టీ ఎమ్మెల్యేల భావన.

