కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత (Konda Sushmitha) తీవ్ర స్థాయిలో దూషించినా మంత్రులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?.. టీమ్ లీడర్‌గా సీఎంను డిఫెండ్ చేసుకునేలా ఎందుకు వ్యవహరించలేదు?.. సుష్మిత వ్యాఖ్యలను ఓపెన్‌గా ఎందుకు ఖండించలేదు?.. వారు చేయాల్సిన పనిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రిని మంత్రులు విశ్వసించడంలేదా?.. ఇలాంటి అనేక సందేహాలు ఇప్పుడు ప్రభుత్వంలో, పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం విపక్షాలు నేరుగా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా మంత్రులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రి కుమార్తె పరుష పదాలతో టార్గెట్ చేసినా ఖండించలేదు. మంత్రి పదవులు అనుభవిస్తూ మంత్రివర్గ పెద్దను కార్నర్ చేస్తుంటే సైలెంట్‌గా ఉండిపోవడాన్ని కింది స్థాయి లీడర్లు తట్టుకోలేకపోయారు. మంత్రులు చేయాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భుజాన వేసుకున్నారు. పార్టీలో ఇది సరికొత్త చర్చకు దారితీసింది. సీఎం లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభానికి నిదర్శనమా?
పదవుల కోసం తహతహలాడినవారు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని బహిరంగా విమర్శిస్తూ ఉంటే కూడా చూసీ చూడనట్టు ఊర్కుండిపోవడమే పార్టీలో చర్చకు దారితీసింది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై మంత్రులు ఎలాగూ చొరవ తీసుకోవడంలేదనే అభిప్రాయానికి వచ్చి మహిళా నేతలు కాల్వ సుజాత, ఎర్రబెల్లి స్వర్ణ, ఇందిరాశోభన్ తదితరులంతా గురువారమే ఫైర్ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఐదుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ వేదికగా కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎంను విమర్శిస్తున్నా మంత్రులు సైలెంట్‌గా ఉండిపోవడమే ఇప్పుడు పార్టీలో కీలక అంశంగా మారింది. పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీయవచ్చనే అనుమానాలూ గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోసారి పవర్‌లోకి రావాలని భావిస్తున్న తరుణంలో సీఎంను విమర్శిస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సిన మంత్రులు ఆ బాధ్యతను ఎందుకు నెరవేర్చలేదన్న వాదనలు నేతల నుంచి వినిపిస్తున్నాయి.
విపక్షాలకు పొలిటికల్ అడ్వాంటేజ్
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల నుంచే కామెంట్లు వస్తుంటే మంత్రులు సైలెంట్‌గా ఉండడం విపక్షాలకు అడ్వాంటేజ్‌గా మారుతున్నదనే మాటలు కూడా హస్తం నేతల్లో నెలకొన్నది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం ఇటీవల “ఇంతకాలం మేం ఆరోపణలు చేస్తే రాజకీయ ఆరోపణలు అని కొట్టిపారేశారు. ఇప్పుడు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అదే విషయాలు చెప్తున్నారు. ప్రభుత్వంలో అవినీతి సమస్య ప్రతిపక్షం సృష్టించింది కాదు.. మీ ఇంట్లోనే సమస్య ఉంది..” అని వ్యాఖ్యానించారు. “రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో అవినీతి ఉంది.. కాంగ్రెస్‌కు విధేయంగా పనిచేసిన పాత కార్యకర్తలను పక్కన పెడుతున్నారు.. సంక్షేమ పథకాల అమలు సరిగా లేదు..” అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో మంత్రుల్లో సఖ్యత లేకపోవడం, భేదాభిప్రాయాలు నెలకొనడం, సమన్వయం కొరవడం, పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ లోపించడం.. ఇవన్నీ విపక్షాలకు అడ్వాంటేజ్‌గా మారాయి. ఇప్పుడు కొండా సుష్మిత వ్యాఖ్యలు మరింత కలిసొచ్చినట్లయింది.
చర్యల్లేకపోవడమే పరిస్థితికి కారణమా? :
పార్టీ లైన్ దాటిన నేతలపై సకాలంలో పీసీసీ చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇలా మారేది కాదన్న అభిప్రాయం కూడా ఎమ్మెల్యేలలో నెలకొన్నది. లక్ష్మణరేఖ దాటితే వేటు తప్పదంటూ పీసీసీ చీఫ్ మాటల్లో గంభీరంగా ఉంటున్న ఆచరణలో ఆ తరహాలో లేరని, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదంతాన్ని ఆ పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నారు. షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుని ఉంటే మిగిలినవారికి ఇష్టారాజ్యంగా మాట్లాడేందుకు అవకాశమే ఉండేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏం మాట్లాడినా పార్టీ నాయకత్వం నుంచి చర్యల్లేవనే ధీమాయే ఇప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పలువురు గొంతు విప్పడానికి కారణమవుతున్నదనేది వారి వాదన. ఏఐసీసీ, మీనాక్షి నటరాజన్ మొదలు పీసీసీ చీఫ్ వరకు పార్టీని కట్టడి చేయడంలో జరుగుతున్న తాత్సారం ఇప్పుడు సంక్షోభానికి కారణమవుతున్నదనే ఆందోళనను వారు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ లైన్ దాటినవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలు ఓపెన్‌గానే శుక్రవారం వ్యాఖ్యానించారు.

