కలం, నిజామాబాద్ బ్యూరో: రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే (Banswada MLA) పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన పోచారం.. ప్రాజెక్టులోని ప్రస్తుత నీటి నిల్వ వివరాలను డీఈ ప్రవీణ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,400.84 అడుగుల నీటిమట్టంతో 12.284 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వరి నాట్లు వేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పోచారం వెల్లడించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గ రైతుల తరఫున పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గంలోని నాన్-కమాండింగ్ ఏరియాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ రివైజ్డ్ శాంక్షన్‌కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ, నిజాంసాగర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

