కలం, నాగర్ కర్నూల్: కల్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) అన్నారు. తాను నాగర్ కర్నూల్ వీడుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా BRS పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ (Nagarkurnool) లో చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపాలని చూస్తే సహించమని హెచ్చరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఏవో 16 లక్షల లెక్కలు చెబుతున్నారని కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ హయాంలో ఏకంగా 14 లక్షల 50 వేల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్నామని అన్నారు. జనాభా పెరిగినప్పుడు సహజంగానే పెళ్లిళ్ల సంఖ్య, దరఖాస్తులు పెరగాలి కదా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పథకాన్ని ఎలా నీరు గార్చారో చెప్పడానికి ప్రభుత్వ వైఖరి సాక్ష్యం అన్నారు. కోర్టులో ఈ ప్రభుత్వం ఎంత ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తోందని అన్నారు.
కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు 30 రోజుల సమయం ఇచ్చినా కావాలనే కౌంటర్ వేయకుండా వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడం వల్లే కదా కోర్టు స్టే ఇచ్చిందని, ఇది ఆడబిడ్డల మీద కక్షతో మీరు చేసిన కుట్ర కాదా? దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అని నిలదీశారు. దీన్ని బట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల ఉన్న ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది అన్నారు. కల్యాణలక్ష్మి ఆగిపోతే పట్టించుకోని ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి, రోడ్లెక్కి పోరాటం చేసిన తర్వాతే ఉలిక్కిపడి కదిలింది అన్నారు.
బీఆర్ఎస్ పోరాటం దెబ్బకు భయపడి ఇప్పుడు హడావిడిగా అఫిడవిట్ వేస్తాం అని, అప్పీల్ చేస్తామని కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఒత్తిడి లేకపోతే ఈ పథకాన్ని ఎప్పుడో శాశ్వతంగా సమాధి చేసేవాళ్లని ఆరోపించారు. BRS పార్టీ నాయకులపై కక్ష్య సాధింపు కోసం, తప్పుడు కేసులు పెట్టి వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను ప్రత్యేకంగా తెచ్చుకున్నారన్నారు. ఆయనకు రోజుకు రూ. 50 లక్షల రూపాయల ఫీజు చెల్లించడానికి ముఖ్యమంత్రికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులకు రోజుకు 50 లక్షలు కట్టే ప్రభుత్వానికి, లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల భవిష్యత్తు ముడిపడి ఉన్న కల్యాణ లక్ష్మి కేసును వాదించడానికి ఒక మంచి లాయర్ దొరకలేదా? లేక కావాలనే వదిలేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధకి తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాడు కేసీఆర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేశారని, కానీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎలా ఎత్తివేయాలా అని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
మర్రి క్యాంటీన్ తొలగించాలని నోటీసులు
బట్టలు అమ్మి సంపాదించుకుంటున్న డబ్బులతో తాను క్యాంటీన్ పెట్టి రూ. 5కే పేదలకు భోజనం అందిస్తున్నానని తెలిపారు. దోచుకోవడం తప్ప పెట్టడం తెలియని ఎమ్మెల్యే క్యాంటీన్ ను తొలగించాలని మున్సిపాలిటీ ద్వారా నోటీసులు పంపించారని విమర్శించారు. ప్రతినెల మున్సిపాలిటీకి రూ. 5వేలు చెల్లిస్తూ భోజనం అందిస్తుంటే ఎమ్మెల్యే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే నవంబర్లో ప్రజలకు సామూహిక వివాహాలు జరిపిస్తానని అన్నారు. ఎమ్మెల్యే కు సర్పంచ్ స్థాయి సరిపోతుందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పథకాలలో రాజకీయాలు చేయడం ఎమ్మెల్యేకు తగదన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించవద్దన్నారు. ప్రజల సొమ్ముతో అధికారులు జీతాలు పొందుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసుల వైఖరిని త్వరలో నిరసన కార్యక్రమంతో ఎండగడతామని అన్నారు. కాగా ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చే క్రమంలో ఐదు మందిని అనుమతించారు. అయితే పెద్ద ఎత్తున పార్టీ అనుచరులు నాయకులతో లోపలి వెళ్లేందుకు మరి జనార్దన్ రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

