కలం, వెబ్ డెస్క్ : పలు రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న గవర్నర్ల స్థానంలో కొత్తవారిని నియమించడంపై కేంద్రంలో కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాలతో పాటు ఇటీవలే కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన రాష్ట్రాల్లోనూ గవర్నర్లు (New Governors) గా కొత్తవారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సమర్ధులైన వ్యక్తులపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది.
ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా 2021 నుంచీ కొనసాగుతున్న ఆనందిబెన్ పటేల్‌ను, కర్ణాటకలో 2021 నుంచి కంటిన్యూ అవుతున్న గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను, ఈ ఏడాది మార్చిలో తమిళనాడు గవర్నర్ బాధ్యతలను చేపట్టిన రాజేంద్ర అర్లేకర్‌ను మార్చాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యక్తిని నియమించాలి, ఏ సామాజికవర్గానికి చెందినవారిని ఎంపిక చేయాలనే కసరత్తు మొదలైనట్లు తెలిసింది.
తమిళనాడులో గతంలో గవర్నర్‌గా పనిచేసిన ఆర్ఎన్ రవి తరహాలో వ్యవహరించే వ్యక్తిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సైతం 2021 నుంచి తావర్‌చంద్ గెహ్లాట్ కొనసాగుతున్నందున భాషాపరమైన సమస్య కూడా ఉత్పన్నం కాకుండా ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉన్నవారి కోసం ఆలోచిస్తున్నది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండడం, నీట్ సహా వందేమాతరం లాంటి అంశాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం, అసెంబ్లీలలో తీర్మానాలు చేయడం.. వీటన్నింటి దృష్ట్యా రానున్న రోజుల్లో కేంద్రం ఎవరిని గవర్నర్లుగా పంపుతుందనేది ఢిల్లీ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల చివరికల్లా కొత్త గవర్నర్ల నియమాకం కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశమున్నది.

