కలం, నల్లగొండ: కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కొనియాడారు. భారత మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి (Rajiv Gandhi Jayanti) సందర్భంగా నల్గొండ (Nalgonda) పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి గురువారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ముందుచూపుతో సాంకేతికతకు బలమైన పునాది వేయడమే కాకుండా, పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన దూరదృష్టి ఆయనదని తెలపగా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కుటుంబం.. త్యాగాల కుటుంబమని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని, ఆ దిశగా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన దేవత అని కొనియాడిన ఆయన, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పీటీసీలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస గౌడ్, స్థానిక కార్పొరేటర్ ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

