కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్‌పై భారత్ మరోసారి పైచేయి సాధించింది. హాకీ వరల్డ్‌కప్(Hockey World Cup 2026) లో పూల్ డీ మ్యాచ్‌లో 5-3తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ తదుపరి రౌండ్‌కు చేరుకుంది. పాకిస్థాన్ మాత్రం సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ మొదలైన వెంటనే భారత్ దూకుడుగా ఆడింది. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతూ వరుస దాడులు చేసింది.
ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ దాడులు ఆపలేదు. అభిషేక్ పాకిస్థాన్ సర్కిల్‌లో బంతిని అద్భుతంగా నియంత్రించాడు. అతడి ప్రయత్నానికి పాకిస్థాన్ డిఫెండర్ టచ్ కావడంతో బంతి నెట్‌లోకి వెళ్లింది. దీంతో భారత్ ఆధిక్యం 2-0కు పెరిగింది.
రెండో క్వార్టర్‌లో భారత్ మరింత జోరు పెంచింది. హర్మన్‌ప్రీత్ మరోసారి గోల్ చేశాడు. పాకిస్థాన్ గోల్‌కీపర్‌ను దాటి వచ్చిన బంతిని భారత కెప్టెన్ బలమైన హిట్‌తో నెట్‌లోకి పంపాడు. దీంతో భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పాకిస్థాన్ వెంటనే పోరాటం మొదలుపెట్టింది. షాహిద్ హన్నన్ గోల్ చేయడంతో ఆధిక్యం 3-1కు తగ్గింది. ఆ తర్వాత అభిషేక్ మరో గోల్ సాధించాడు. దీంతో భారత్ 4-1తో ముందంజలో నిలిచింది. పాకిస్థాన్ మరోసారి పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చింది. దీంతో స్కోరు 4-2కు చేరింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ రెండు గోల్స్ ఆధిక్యంలో ఉంది. హర్మన్‌ప్రీత్, అభిషేక్ ఇద్దరూ అప్పటికే రెండేసి గోల్స్ సాధించారు.
మూడో క్వార్టర్‌లో భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. పాకిస్థాన్ డిఫెండర్ సర్కిల్‌లో ఫౌల్ చేయడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. హార్దిక్ సింగ్ ఎలాంటి పొరపాటు లేకుండా దాన్ని గోల్‌గా మార్చాడు. దీంతో భారత్ 5-2 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్ చివర్లో అభిషేక్ మరోసారి గోల్ చేసినట్లు కనిపించింది. అయితే బంతి బయట నుంచి నెట్‌లోకి వెళ్లడంతో అంపైర్ దాన్ని గోల్‌గా ప్రకటించలేదు. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 5-2తో ముందంజలో ఉంది. చివరి క్వార్టర్‌లో పాకిస్థాన్ మరో గోల్ సాధించింది. హన్నన్ షాహిద్ భారత గోల్‌కీపర్‌ను నేరుగా ఎదుర్కొని గోల్ చేయడంతో స్కోరు 5-3కు చేరింది. దీంతో చివరి నిమిషాల్లో ఉత్కంఠ పెరిగింది.
అయితే భారత్ ఒత్తిడికి లోనుకాలేదు. బంతిని నియంత్రిస్తూ పాసులతో సమయాన్ని గడిపింది. పాకిస్థాన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. చివరకు 5-3తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పూల్ డీలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్ ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. దీంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పాకిస్థాన్ రెండు ఓటములు, ఒక డ్రాతో సెమీఫైనల్ రేసు నుంచి బయటపడింది. గత పదేళ్లలో పాకిస్థాన్‌పై భారత్‌కు ఉన్న ఆధిపత్యం కూడా కొనసాగింది. ఈ కాలంలో ఇరు జట్లు 19 సార్లు తలపడగా భారత్ 17 మ్యాచ్‌లు గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

