కలం, వెబ్ డెస్క్ : అమెరికా రాయబారి (US Ambassador) సెర్గియో గోర్ (Sergio Gor) బుధవారం జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో (Omar Abdullah) శ్రీనగర్లో సమావేశమయ్యారు. రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం గోర్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) భారత్లో ఎంతో ముఖ్యమైన ప్రాంతమని, తొలిసారి ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతం అద్భుతమైన అందాలతో ఉందని పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లాతో జరిగిన సమావేశం చాలా స్నేహపూర్వకంగా, నిర్మాణాత్మకంగా సాగిందని చెప్పారు.
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమెరికా గుర్తించిందని గోర్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ పర్యటనపై అమెరికా జారీ చేస్తున్న ట్రావెల్ అడ్వైజరీలను పునఃసమీక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ విషయంలో ఇప్పుడే ఎలాంటి కీలక ప్రకటన చేయలేనని స్పష్టం చేశారు. అమెరికా ఎప్పటికప్పుడు తన ప్రయాణ హెచ్చరికలను సమీక్షిస్తుందని, జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న ట్రావెల్ అడ్వైజరీని తగ్గించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తామని గోర్ తెలిపారు. జమ్మూకశ్మీర్ ఒక అందమైన ప్రాంతమని, భద్రతా పరిస్థితులు మరింత మెరుగుపడుతున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ ప్రాంతంతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

