కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell), ఆయన భార్య వినీ రామన్ (Vini Raman) దంపతులకు రెండో సంతానం కలిగింది. ఆడబిడ్డకు మాయా మ్యాక్స్‌వెల్ (Maia Maxwell) అని పేరు పెట్టారు. ఆగస్టు 18న ఈ విషయాన్ని దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కలల పాప తమ జీవితాల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో అభిమానులు, క్రికెట్ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. మ్యాక్స్‌వెల్, వినీ రామన్‌కు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. 2023 సెప్టెంబర్ 11న లోగన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్ జన్మించాడు. ఇప్పుడు మాయా వారి రెండో సంతానం, తొలి కుమార్తె. మ్యాక్స్‌వెల్, వినీ రామన్ 2013 డిసెంబర్‌లో తొలిసారి కలిశారు. 2017లో తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట 2022 మార్చి 27న మెల్‌బోర్న్‌లో వివాహం చేసుకున్నారు. వివాహ వేడుకల్లో క్రైస్తవ, తమిళ బ్రాహ్మణ సంప్రదాయాలను పాటించారు.
క్రికెట్ విషయానికి వస్తే.. మ్యాక్స్‌వెల్ 2025 జూన్‌లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 149 వన్డేల్లో 3,990 పరుగులు, 77 వికెట్లు సాధించారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై అజేయంగా 201 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచింది. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో బెల్‌ఫాస్ట్ వుల్వ్స్ జట్టుకు సహ యజమానిగా, కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీ ఆగస్టు 26న ప్రారంభం కానుంది. జట్టును మొదటి నుంచి నిర్మించడం కొత్త అనుభవంగా ఉందని, స్పష్టమైన ప్రణాళికతో జట్టును సిద్ధం చేసినట్లు మ్యాక్స్‌వెల్ తెలిపారు.

